బంగాల్‌ సీఎస్‌, హోంశాఖ కార్యదర్శి, డిజిపిలపై ఈసీ వేటు

బంగాల్‌ సీఎస్‌, హోంశాఖ కార్యదర్శి, డిజిపిలపై ఈసీ వేటు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. రాష్ట్ర పరిపాలనలో కీలక మార్పులు చేబడుతూ రాష్ట్ర ప్రభుత్వంలోని  కీలక సీనియర్ అధికారులను పదవుల నుంచి తప్పిస్తూ కొత్త నియామకాలు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోమ్ కార్యదర్శి, డిజిపి, కలకత్తా పోలీస్ కమీషనర్ లను బదిలీ చేసింది.  స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి దుష్యంత్ నరియాలాను రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించాలని తెలిపింది. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న నందిని చక్రబర్తిని ఆ పదవి నుంచి తప్పించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆమెను ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన బాధ్యతల్లోనూ నియమించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అదే విధంగా రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ జగదీష్ ప్రసాద్ మీనాను కూడా పదవి నుంచి తప్పించి, 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగమిత్ర ఘోష్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించింది.  జనవరి నెలాఖరులో బాధ్యతలు స్వీకరించిన కీలక పోలీస్ అధికారులలో, పీయూష్ పాండే స్థానంలో సిద్ధ్ నాథ్ గుప్తా డిజిపిగా, కోల్‌కతా పోలీస్ కమిషనర్ సుప్రతీమ్ సర్కార్ స్థానంలో అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

నటరాజన్ రమేష్ బాబు ప్రభుత్వ దిద్దుబాటు సేవలు విభాగం డిజిగా నియమితులయ్యారు.  అజయ్ ముకుంద్ రనడే  ప్రభుత్వ అదనపు డిజి (శాంతిభద్రతలు)గా నియమితులయ్యారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం కార్యదర్శి సుజీత్ కుమార్ మిశ్రా సంతకంతో జారీ చేసిన ఆదేశాల్లో ఈ మార్పులను వెంటనే అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర పరిపాలనా వ్యవస్థపై ఎన్నికల సంఘం నేరుగా పర్యవేక్షణ చేపడుతుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య గత కొన్ని నెలలుగా పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణ, బూత్ లెవల్ అధికారులకు చెల్లింపులు వంటి అంశాలపై ఇరువైపులా వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.