ఓ వైపు ఇరాన్‌పై యుద్ధం, మరో వైపు ఈ ఏడాది నవంబరులో జరగాల్సిన మధ్యంతర ఎన్నికలతో సతమతమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికల వ్యవస్థను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. మన దేశంలో అమలు పరుస్తున్న ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ తరహాలోనే అక్కడ కూడా ఓటర్ల వెరిఫికేషన్ చేపట్టి, తన వ్యతిరేకుల, వలసదారుల ఓట్లను తొలగించేందుకు యోచిస్తున్నారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలలో సమగ్రతను, కచ్చితత్వాన్ని కాపాడడం దేశ ప్రాధాన్యత అని చెబుతూ ఈ కసరత్తు చేస్తున్నారు. డూప్లికేట్ లేదా అనర్హులను ఏరివేసేందుకు ఓటరు పరిశీలన ప్రక్రియను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెబుతున్నారు. ఎన్నికల జాబితాలను తరచుగా సమీక్షించాలని సూచించారు.
ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామిక వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని, ఎన్నికలలో అవకతవకలకు అవకాశం ఉండదని చెప్పారు. ప్రతి ఓటరూ తన పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందంటూ ప్రతిపాదించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అయితే అది సెనెట్‌లో నిలిచిపోయింది. వచ్చే వారం సెనెట్‌లో చర్చకు వస్తుందని భావిస్తున్నారు.
అమెరికాలో ఫెడరల్ వ్యవస్థ ఉంది. దీని ప్రకారం ఆయా రాష్ట్రాలు తమ సొంత పద్ధతులను అనుసరించే అవకాశముంది. వాటిని నీరుగార్చి ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పౌరసత్వానికి సంబంధించి డాక్యుమెంటరీ రుజువులు చూపాల్సిన అవసరం లేదు. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, యుఎస్ పాస్‌పోర్ట్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడి, యుఎస్ పౌరుడిగా లేదా అక్కడ జీవిస్తున్నట్లుగా జనన ధ్రువీకరణ పత్రం, సైనిక ఐడిలు చెల్లుబాటవుతాయి.
ఈ పద్ధతి అమలులోకి వస్తే ప్రతి ఎన్నికల్లోనూ రిపబ్లికన్లే గెలుస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కరణలపై అమెరికాలోని రాజకీయ పరిశీలకులు, శాసనకర్తల్లో చర్చ మొదలైంది. కఠిన నిబంధనలు విధిస్తే ఓటర్లు ఎన్నికల ప్రక్రియకు దూరమవుతారని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే శాసనపరమైన చర్యలు అవసరమవుతాయని, ఫెడరల్ అధికారులు – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.

More Stories
గ్రీన్ కార్డుల కోసం చోరీలు.. 11 మంది భారతీయులు అరెస్ట్
ఖార్గ్ ద్వీపంపై దాడి.. అమెరికా చమురు ఆస్తులను ధ్వంసం చేస్తాం!
పాకిస్తాన్ ఆర్మీ సెంటర్లపై ఆఫ్ఘన్ దాడులు