లద్ధాఖ్ పర్యావరణ వేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. గత ఆరు నెలలుగా ఆయనపై కొనసాగుతున్న నిర్బంధాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శనివారం పేర్కొంది. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద ఉన్న అధికారాలను వినియోగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లద్ధాఖ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా సహా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ గతేడాది సెప్టెంబరులో లేహ్ జిల్లాలో యువత ఆందోళన చేపట్టింది.
2025, సెప్టెంబర్ 24వ తేదీన లేహ్‌లో అల్లర్లు చోటుచేసుకోవడంతో శాంతి, భద్రతలు క్షీణించాయి. అవి హింసాత్మకంగా మారడంతో నలుగురు మృతిచెందారు. వాంగ్‌చుక్ ప్రకటనతోనే లేహ్‌లో హింస చెలరేగిందని అప్పట్లో కేంద్రం తెలిపింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 26న లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జైలుకు తరలించారు.
అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సోనమ్‌పై ఉన్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లడాఖ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
బంద్‌లు, నిరసనలో ప్రాంతం నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో హైపవర్ కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించనున్నట్లు చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పాలనను అక్కడి ప్రజలు మూడేళ్లుగా నిరసిస్తున్నారు. తమ భూమి, సంస్కృతి, వనరుల పరిరక్షణ కోసం రాజ్యాంగ భద్రత ఉండాలని కోరుతున్నారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ రెండు వారాలుగా చేసిన దీక్షలను హింసాత్మక ఘటనల నేపథ్యంలో వాంగ్‌చుక్ విరమించడంతోపాటు శాంతికి పిలుపునిచ్చారు.
నేపాల్-బంగ్లాదేశ్‌లలో జరిగిన నిరసనల తరహాలోనే దేశంలో కూడా ఆందోళనల కోసం వాంగ్‌చుక్ యువతను ప్రేరేపించడానికి ప్రయత్నించారని కేంద్రం అంతకుముందు ఆరోపించింది. అయితే, ఆయన భార్య గీతాంజలి జె ఆంగ్మో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ, వాంగ్‌చుక్ నిర్బంధం చట్టవిరుద్ధమని, ఇది ఆయన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సవాలు చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ హింసను ఎప్పుడూ ఖండించారని, హింస వల్ల లద్ధాఖ్ ఐదేళ్లుగా చేస్తున్న ‘తపస్సు’, శాంతియుత పోరాటం విఫలమవుతుందని ఆయన తన సోషల్ మీడియాలో స్పష్టంగా పేర్కొన్నారని ఆమె కోర్టుకు వివరించారు.

More Stories
దక్షిణాది సీట్లు తగ్గుతాయనడం అసత్యం
చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడులో ఐఎస్ఐ హస్తం?
అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం, ఘర్షణ