అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు ప్రచారంలో నిజం లేదు

అమెరికాతో వాణిజ్య ఒప్పందం రద్దు ప్రచారంలో నిజం లేదు

అమెరికాతో ఇటీవల కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని భారత్ నిలిపివేయనుందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. యూఎస్​ ట్రేడ్ డీల్​ రద్దు చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని శుక్రవారం పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు భారత్- అమెరికా చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మరోవైపు వాణిజ్య ఒప్పందాన్ని భారత్​ కొన్ని నెలలు వాయిదా వేస్తున్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రి పీయూశ్ గోయల్ ఖండించారు. డిల్లీలో జరిగిన ఎన్ ఎక్స్ టి సమ్మిట్ 2026 కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత్, అమెరికా రెండు దేశాలకు లాభదాయకమని తెలిపేరు. భారత్‌కు కీలకమైన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా రక్షించామని తెలిపారు.

జన్యుమార్పిడి (జీఎం) ఉత్పత్తులు, బియ్యం, మొక్కజొన్న, సోయాబీన్, అలాగే పాలు, కోళ్లు వంటి ఉత్పత్తుల విషయంలో భారత్ ప్రయోజనాలు కాపాడినట్లు వివరించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఆధునిక సాంకేతికత భారత్‌కు అందుబాటులోకి వస్తుందని గోయల్ తెలిపారు. దీంతో భారత్ ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కృత్రిమ మేధస్సు రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు కూడా ఈ ఒప్పందం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా భారత్, అమెరికా మధ్య పరస్పర ప్రయోజనాల ఆధారంగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.

కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌- భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం వల్లే ఈ డీల్‌ కుదిరిందని  భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలిపారు. ఇండియాటుడే కాంక్లేవ్‌ 2026లో మాట్లాడిన ఆయన వచ్చే నెలలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని తెలిపారు. అలాగే రుదేశాల మధ్య త్వరలోనే క్రిటికల్‌ మినరల్స్‌ అగ్రిమెంట్​ కూడా కుదరనుందని వెల్లడించారు.

అమెరికా తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అనైతిక విదేశీ పద్ధతులను పరిశీలించడానికి ట్రంప్ యంత్రాంగం ఇటీవల దర్యాప్తును ప్రారంభించింది. ఇందులో యూఎస్ వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్‌ ఉన్నాయి.  అమెరికా సుప్రీంకోర్టు గత నెలలో ఈ సుంకాలను చట్టవిరుద్ధంగా ప్రకటించిన నేపథ్యంలో మళ్లీ సుంకాల ఒత్తిడి తీసుకురావడమే ఈ చర్యల ఉద్దేశమని సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికా​తో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడాన్ని భారత్ ఆలస్యం చేస్తుందని, రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రచారం మొదలైంది.