కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆయన కుమారుడైన 56 ఏళ్ల మొజ్తబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో లేదా ఆ తర్వాత జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడినట్లు బ్రిటీష్ టాబ్లాయిడ్ ‘ది సన్’ పేర్కొంది. టెహ్రాన్‌లోని సినా యూనివర్సిటీ ఆసుపత్రిలో గట్టి భద్రత మధ్య ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
మరోవైపు మొజ్తబా ఖమేనీ చికిత్స గురించి ఒక ఇరాన్ నేత వివరాలు వెల్లడించినట్లు ‘ది సన్’ తెలిపింది. “మా నాయుకుడు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఒకటి లేదా రెండు కాళ్ళు తెగిపోయాయి. కాలేయం, కడుపు కూడా చీలిపోయింది. ఆయన స్పష్టంగా కోమాలో ఉన్నారు” అని ఆ ఇరాన్ నేత అన్నట్లు పేర్కొంది.
ఇరాన్ ఆరోగ్య మంత్రి, యుద్ధ గాయాలకు చికిత్స చేసిన అనుభవం ఉన్న సీనియర్ సర్జన్, అనుభవజ్ఞుడైన ట్రామా సర్జన్ మొహమ్మద్ రెజా జఫర్‌ఘండి పర్యవేక్షణలో మొజ్తబా ఖమేనీకి చికిత్స కొనసాగుతున్నట్లు వార్తా కథనంలో పేర్కొంది. కాగా, సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ నుంచి ప్రత్యక్ష ఆదేశాలు లేకుండానే ఇరాన్ నాయకత్వ నిర్మాణం యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లు ఆ నేత స్పష్టం చేశారని ‘ది సన్’ తెలిపింది.
చురుకైన నాయకుడు లేకుండా కూడా ఇరాన్ సైనిక కార్యకలాపాలు కొనసాగే వ్యవస్థను అయతుల్లా అలీ ఖమేనీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. “ఆయన తండ్రి ఒక వ్యవస్థను వదిలి వెళ్ళాడు. ఒక దెయ్యం నడిపేలా అది ఉంది. అందుకే ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇప్పటికీ ఎగురుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగుతున్నది” అని ఆయన అన్నట్లు ‘ది సన్’ పేర్కొంది.
అయితే ‘ది సన్’ వార్తా కథనంపై ఇరాన్ స్పందించలేదు. పైగా కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికై ఆరు రోజులైనా మొజ్తబా ఖమేనీ ఇంతవరకు బహిరంగంగా కనిపించలేదు. కనీసం వీడియో సందేశం కూడా విడుదల చేయలేదు. రెండు రోజులక్రితం తొలి సందేశం పేరుతో గురువారం ఒక ప్రకటనను ఇరాన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది. ఇరానియన్ల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని, హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటామని ఆయన హెచ్చరించినట్లుగా టీవీ వ్యాఖ్యాత దీనిని చదివి వినిపించారు.
కాగా, ఈ ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్ సైన్యాన్ని అణచివేస్తున్నామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఇరాన్‌పై దాడుల సంఖ్యతో పాటు వాటి కచ్చితత్వాన్నీ పెంచామన్నారు. ఏఐ టెక్నాలజీ, సైబర్ టూల్స్, అంతరిక్ష టెక్నాలజీ వంటి వాటితో ఇరాన్ కళ్లు కప్పి, తికమక పెట్టి, బోల్తా కొట్టించి దాడులు చేస్తున్నామని ఆయన చెప్పారు.

More Stories
ఖార్గ్ ద్వీపంపై దాడి.. అమెరికా చమురు ఆస్తులను ధ్వంసం చేస్తాం!
యుద్ధంపై రోజుకో మాట మారుస్తున్న ట్రంప్.. పర్యవసానం అస్పష్టం
ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు.. భయంతో ఎవరూ బుక్ చేయొద్దు