గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వీకే శశికళ తాజాగా తన కొత్త రాజకీయ పార్టీ పేరును, గుర్తును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతోంది.
శశికళ తన నూతన పార్టీకి ‘ఆలిండియా పురుచ్చి తలైవార్ మక్కల్ మునేత్ర కళగం’ (ఏఐపిటిఎంఎంకె) అని పేరు పెట్టారు. ఏఐఏడీఎంకే వ్యవస్థాపకులు, దివంగత ఎంజీ రామచంద్రన్ ను ‘పురుచ్చి తలైవార్’ అని పిలుచుకుంటారు. తమిళనాడు ప్రజల కోసం కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ పార్టీ పనిచేస్తుందని శశికళ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నాయకుడు పురచ్చితలైవర్ ఎంజీఆర్ ఆలోచనలు, సిద్ధాంతాలను కొనసాగించే లక్ష్యంతోనే ఈ పార్టీని ప్రారంభిస్తున్నామని శశికళ చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా పార్టీ పని చేస్తుందని తెలిపారు. పార్టీ గుర్తుగా ‘కొబ్బరి చెట్టు’ ను శశికళ ప్రకటించారు. కొబ్బరి చెట్టు ఐక్యతకు చిహ్నమని, తమ పార్టీ ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే ఆవిష్కరించిన పార్టీ జెండాలో నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత (అమ్మ) చిత్రాలను పొందుపరిచారు. తమిళనాడు, పుదుచ్చేరిలో జరగనున్న రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతామని శశికళ స్పష్టం చేశారు. సమాన భావజాలం ఉన్న పార్టీలతో పొత్తులకు సిద్ధమని కూడా ఆమె సంకేతాలు ఇచ్చారు.
జయలలిత మరణం తర్వాత చీలిపోయిన కార్యకర్తలను, ఓటు బ్యాంకును ఏకం చేయడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ప్రజలకు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అందించాలనే లక్ష్యంతో ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్తులో ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

More Stories
ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభ సమావేశాలు ప్రారంభం
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
కేరళలో సీనియర్ సిపిఎం నేత సుధాకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ!