ఢిల్లీకి చెందిన హరీశ్ రాణా ఇంజినీరింగ్ విద్యార్థి. చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో 2013 ఆగస్టు 20న బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రముఖ దవాఖానల్లో చికిత్స అందించినా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు.
చికిత్స కారణంగా రాణా కుటుంబం మానసికంగానే కాకుండా ఆర్థికంగానూ ఎంతో చితికిపోయింది. దీంతో రాణా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ అతని తల్లిదండ్రులు 2024లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. సుప్రీంకోర్టులోనూ ఇదే అనుభవం ఎదురైంది. అయితే, రాణా కోలుకొనే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదిక ఇవ్వడంతో అతని కుటుంబ సభ్యులు మళ్లీ సుప్రీం గడప తొక్కారు.
రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకొని రాణా తల్లిదండ్రుల అభిప్రాయాలను కోరింది. తమ ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకొని మానవీయ కోణంలో తమ బిడ్డకు మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వాళ్లు కోర్టును వేడుకొన్నారు. దీంతో ఎంత చికిత్స అందించినప్పటికీ, రాణా కోలుకొనే అవకాశం లేకపోవడంతో అతనికి అందిస్తున్న ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించాలని కోర్టు తాజాగా ఆదేశించింది.
రాణా కారుణ్య మరణం కేసులో తీర్పును వెలువరించేటప్పుడు బెంచ్‌లో భాగమైన జస్టిస్ జేబీ పార్దీవాలా ఒకింత చలిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక ప్రమాదం రాణా జీవితాన్ని ఊహించని రీతిలో పూర్తిగా మార్చి వేసిందన్న ఆయన ప్రమాదానికి ముందు రాణా ఎంతో తెలివైన, చురుకైన విద్యార్థి అంటూ గుర్తు చేశారు. కేసు పూర్వాపరాలను తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
‘ఒకరిని ప్రేమించడం అంటే కష్ట సమయంలో కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవడమే. రాణా విషయంలో అతని తల్లిదండ్రులు అదే చేశారు. జీవితం, ప్రేమ, నష్టం ఇలా వీటన్నింటిని పక్కనబెడితే, ఈ కేసు విషయంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ కఠిన నిర్ణయం తీసుకొన్నాం’ అని కోర్టు ఈ సందర్భంగా పేర్కొన్నది.ఈ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చావును కోరుకోరని, కానీ తమకు అలాంటి దుస్థితి వచ్చిందని రాణా తండ్రి అశోక్ రాణా కన్నీటిపర్యంతమయ్యారు.

More Stories
ఎన్సిఇఆర్టిపై కేంద్రం వివరణపై సుప్రీం అసంతృప్తి
జీపీఎస్ జామింగ్‌తో చిక్కుకుపోయిన 1000కి పైగా షిప్‌లు!
సరిహద్దుల్లో ఓ పాక్ తీవ్రవాది హతం