సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం

సీఈసీ అభిశంసనకు నోటీసుపై 180 మంది ఎంపీల సంతకం
లోక్‌సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండు రోజుల వాడి, వేడి చర్చల అనంతరం వీగిపోయిన వెంటనే రాజ్యాంగ వ్యవస్థలను దుర్వనియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ పై తృణమూల్ కాంగ్రెస్  పార్టీ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. 
 
విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 180 మంది ఎంపీలు ఇందుకు సంబంధించిన నోటీసుపై సంతకాలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిలో 120 మంది లోక్‌సభ ఎంపీలు, 60 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ప్రతిపాదిత అభిశంసన తీర్మానంలో సీఈసీపై తృణమూల్ కాంగ్రెస్ పలు ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది.
ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా చేశారనేది ఆయనపై మెదటి ఆరోపణ.
మార్చి 10వ తేదీన సమావేశమయ్యేందుకు ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన టీఎంసీ నేతల పట్ల సీఈసీ అనుచితంగా ప్రవర్తించారనేది రెండో ఆరోపణ. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశారనేది మూడో ఆరోపణ.  అభిశంసన తీర్మానాన్ని ఉభయసభల్లోనూ ప్రవేశపెట్టాలని, ఈనెల 12న కానీ, 13న కానీ నోటీసు సమర్పించాలని విపక్షాల యోచనగా ఉంది.
విపక్ష కూటమి తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అభిశంసన ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొంటున్న తొలి సీఈసీ కూడా జ్ఞానేశ్ కుమార్ అవుతారు. 1990లో అప్పటి సీఈసీ టీఎన్ శేషన్, 2006లో నవీన్ చావ్లాపై అభిశంసన తీర్మానం పెట్టాలనే చర్చలు జరిగినప్పటికీ అవి కార్యరూపంలోకి రాలేదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో హడావిడిగా పశ్చిమబెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టడాన్ని మొదట్నించీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు.
ఓటర్ల జాబితా రివిజన్ ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు జరిగాయంటూ ఈసీకి ఈవారం మొదట్లో టీఎంసీ లేఖ రాసింది. లక్షలాది మంది అర్హులైన ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించారని సీఎం ఆరోపించారు. ఎస్ఆర్ఐ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం ఓటర్ల తుది జాబితాను ఫిబ్రవరి 28న ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 5,46,053 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్టు ప్రకటించింది. దీనిపై మమతా బెనర్జీ నిరసనలకు దిగారు.