అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాలని ఎన్‌సిఇఆర్‌టిని ఆదేశించామన్న కేంద్రం వివరణపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠ్యపుస్తకాలను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఉండాల్సిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం బుధవారం వ్యాఖ్యానించింది.
ఎన్‌సిఇఆర్‌టిని ఆదేశించడానికి బదులుగా కమిటీని నియమించే ఉంటే ప్రశంసలు పొంది ఉండేవారని కేంద్రాన్ని ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. ఎనిమిదో తరగతి సాంఘీకశాస్త్రంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే శీర్షికతో విద్యార్థులకు బోధించడానికి ఒక అధ్యాయాన్ని ముద్రించడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
కేవలం 8వ తరగతి కాకుండా అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను సమీక్షించాల్సిందిగా ఎన్‌సిఇఆర్‌టిని ఆదేశించామని సొలిసిటర్ జనరల్ తుషార్‌మెహతా కోర్టుకు తెలిపారు. నిర్మాణాత్మక మార్పులను చేపట్టామని, సంబంధిత నిపుణులు పరిశీలించకుండా ప్రచురణకు అనుమతించబడదని పేర్కొన్నారు. అంతకుముందు, 8వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో వివాదాస్పద అధ్యాయంపై ‘జాతీయవిద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి)’ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపింది.
ఈ సందర్భంగా ఎన్‌సిఇఆర్‌టి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ”ఆ అధ్యాయంలో జరిగిన తప్పిదానికి ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్, సభ్యులు తరపున బేషరతుగా,సంపూర్ణ క్షమాపణలు తెలుపుతున్నాం. వివాదాస్పద అధ్యాయం ఉన్న పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నాం. ప్రస్తుతం అంది అందుబాటులో లేదు ’’ అని తెలిపింది.
ఈ కారణంగా కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. భవిష్యత్తులో విద్యా విషయాల్లో ఖచ్చితత్వం, సున్నితత్వం మరియు బాధ్యతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఎన్‌సిఇఆర్‌టి కట్టుబడి ఉందని పేర్కొంది.కాగా, 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశాన్ని ప్రొ.మైఖేల్ డానినో సహా టెక్స్ట్‌బుక్ డెవలప్మెంట్ టీమ్ సభ్యులు సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లు రూపొందించారని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
వివాదాస్పద ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాన్ని పూర్తిగా నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఫిబ్రవరి 26న తీర్పు వెలువరించగా.. దానిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగినట్లు ధర్మాసనం గుర్తుచేసింది. ఈ ప్రచారం వెనుక ఉన్న సామాజిక మాధ్యమ వేదికలు, వ్యక్తుల వివరాలను తమకు అందజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కోర్టు తీర్పులను వక్రీకరిస్తూ ఇష్టానురీతిన వ్యాఖ్యలు చేసేవారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది.

More Stories
ఎన్‌సిఇఆర్‌టికి `డీమ్డ్ టు బి యూనివర్శిటీ’ హోదా
53 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మళ్ళీ మానవుడు
బీహార్ గుడిలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి