పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు.
దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందికి క్లీన్‌చీట్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎం సంజయ్‌కుమార్, జీ మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీల వ్యవహారంపై విడతల వారీగా స్పీకర్ విచారణ జరిపారు.
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై నాలుగు రోజుల క్రితం విచారణ పూర్తి చేసి, తాజాగా తీర్పును ప్రకటించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమేనని మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని కేటీఆర్ అభివర్ణించారు. ఇది కేవలం తీర్పు కాదు.. అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థను ఉపయోగించే ఉదాహరణ అని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి అదే పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేయడం మొత్తం రాష్ట్ర ప్రజలు చూసిన విషయమేనని పేర్కొంటూ ఇంత స్పష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ రోజు వచ్చిన తీర్పు కేవలం ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాకుండా రాజ్యాంగాన్ని, ప్రజల తీర్పును కూడా అగౌరవపర్చడమే, అవమానించడమే అని స్పష్టం చేశారు.
More Stories
గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివప్రతాప్ శుక్లా
అర్బన్ నక్సల్స్ తో తెలంగాణ విద్యావిధానమా?
రామగుండంలో రానున్న ఎన్టీపీసీ ప్లాంట్ విద్యుత్ కొనాలి!