పశ్చిమాసియా ఘర్షణలపై పీ-5 దేశాల భేటీకి రష్యా పిలుపు 

పశ్చిమాసియా ఘర్షణలపై పీ-5 దేశాల భేటీకి రష్యా పిలుపు 

* చైనా ఐదు సూత్రాల ప్రతిపాదన

ఇరాన్‌పై అమెరికా – ఇజ్రాయెల్ దాడులపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు (పీ-5) భేటీ కావాలని రష్యా పిలుపునిచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయం తీవ్రంగా చచ్చుబడి పోయిందని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు భేటీ కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభ కాలానికి ముందు కూడా ఒకసారి ఇదే ప్రతిపాదనను పుతిన్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ భద్రత, సుస్థిరతలపై చర్చించేందుకు పీ-5లోని రష్యా, చైనా, అమెరికా, ఫ్రాన్స్, యూకే భేటీ కావాలని పుతిన్ కోరుకుంటున్నారని దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు.  అంతర్జాతీయ న్యాయం అనేది దాదాపు నశించిపోయిందని, ఇలాంటప్పుడు అంతర్జాతీయ న్యాయంలోని నిబంధనలు, సూత్రాలను అనుసరించమని ఇతరులకు ఎలా చెప్పగలమో తనకు అర్థం కావడం లేదని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవానికి అంతర్జాతీయ న్యాయం అనేది ఇంకా మిగిలి లేదని పెస్కోవ్ స్పష్టం చేశారు.  “ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు చేశాక పశ్చిమాసియా ప్రాంతంలో అస్థిర పరిస్థితులు ఏర్పడ్డాయి. యావత్ మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న సైనిక ఘర్షణల సంఖ్య కూడా పెరిగింది. వీటి ఫలితంగా ప్రతికూలమైన రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పెస్కోవ్ హెచ్చరించారు.

మరోవంక, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను నివారించడానికి చైనా ఐదు సూత్రాలను ప్రతిపాదించింది. వీటిలో మొదటిది తక్షణమే శత్రుత్వాలను విరమించి అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని, ప్రాణనష్టాన్ని నివారించడం అత్యంత ప్రధానమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు. సైనిక బలంతో రాజకీయ సమస్యలను పరిష్కరించలేమని పునరుద్ఘాటించారు. 
 
ఇక రెండోది : ఇరాన్‌, ఇతర గల్ఫ్‌ దేశాల సరిహద్దులను, స్వతంత్రతను ఇతర దేశాలు గౌరవించాలని, బాహ్య శక్తుల జోక్యం ఉండరాదని హితవు పలికింది. మూడోది : అణువ్యాప్తిని అరకట్టిడానికి విస్తృత సంప్రదింపులు, చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. నాలుగోది : హోర్ముజ్‌ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచాలని సూచించింది. 
 
అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఐదోవది : మదధ్యప్రాచ్చ దేశాలు తమ భద్రత సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి వీలుగా ఒక నూతన వేదికను ఏర్పాటు చేసుకోవాలని, బాహ్య దేశాల ‘జోక్యం’ లేని భద్రతా వ్యవస్థను చైనా ప్రోత్సహిస్తుందని తెలిపారు.