భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి

భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి
 
భారత్‌, చైనా దేశాలు పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఒకరికొకరు ముప్పు అని భావించకుండా అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలని తెలిపారు. వార్షిక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకుండా సంబంధాలను మెరుగుపర్చుకునే విషయానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు.
 
2024లో కజాన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల సమావేశం జరిగిందని, అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని వాంగ్‌ యీ చెప్పారు. గత ఏడాది తియాంజిన్‌లో ఇరుదేశాల నేతలు మరోసారి భేటీ అయిన తర్వాత మరింత మెరుగుదల కనిపించిందని తెలిపారు. 
 
ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకోవడం, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటం వంటివి ఇరుదేశాలకూ ప్రయోజనం చేకూర్చాయిని అయన  పేర్కొన్నారు. భారత్‌, చైనా సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకోవాలని, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలని, అభివృద్ధిపై దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాలుగా, గ్లోబల్ సౌత్ సభ్యులుగా, భారత్‌, చైనా దీర్ఘకాలిక సంబంధాలు కలిగి ఉన్నాయని వాంగ్ తెలిపారు.

“భారత్, చైనాలు పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలి. అలాగే ఒకరికొకరు ముప్పు అని భావించకూడదు. పరస్పరం అభివృద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలి. భారత్‌, చైనాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకోవాలి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలి. అలాగే అభివృద్ధిపై దృష్టి సారించాలి” అని వాంగ్ యీ తెలిపారు.
 
పరస్పర విశ్వాసం, సహకారం అనేవి రెండు దేశాల అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. విభజనవాదం, ఘర్షణలు అభివృద్ధిని దెబ్బతీస్తాయని ఆయన స్పష్టం చేశారు. 2020లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో ఇరు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణతో ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే పలు దఫాలుగా చర్చలు జరిపిన భారత్‌, చైనా దేశాలు పరిస్థితులను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకున్నాయి.