గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ క్షమాపణ.. అమెరికాకు లొంగదని స్పష్టం

గల్ఫ్‌ దేశాలకు ఇరాన్ క్షమాపణ.. అమెరికాకు లొంగదని స్పష్టం
ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్‌ దేశాలతోపాటు తుర్కియే, అజార్ బైజాన్ వంటి అనేక దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు చేసింది. అయితే, ఇలా పొరుగు దేశాలపై దాడులు చేసినందుకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పారు.
‘‘పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఆ దేశాలపై దాడులు చేయకూడదని ఇరాన్ మధ్యంతర నాయకత్వం నిర్ణయించింది. ఇకపై పొరుగు దేశాలపై దాడులు చేయం. క్షిపణులు ప్రయోగించం. ఆ దేశాల నుంచి మా దేశంపైకి దాడులు జరగనంతవరకే మేం దాడులకు దిగకుండా ఉంటాం’’ అని పెజెష్కియన్ తెలిపారు. 

ఒకవేళ అమెరికా సైన్యం కొలువుదీరి ఉన్న ఆయా దేశాల నుంచి ఇరాన్‌పై దాడి జరిగితే మాత్రం తిరిగి దాడి చేస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్‌కు సంబంధించిన ఒక టీవీ ఛానల్‌తో మసౌద్ ఈ ప్రకటన చేశారు.  “మాకు పొరుగు దేశాలపై దాడి చేయాలనే ఉద్దేశం లేదు. వారు మా సహోదర దేశాలు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనేలా కలిసి పనిచేయాలి” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ దేశాల నుంచి దాడి జరిగితే మాత్రం తగిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.=

మరోవైపు ఇరాన్ ఏ దేశానికి లొంగిపోదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు, ఒప్పందాలు ఉండబోవని, బేషరతుగా లొంగిపోవాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ మాట్లాడుతూ, తమ దేశం ఎవరికీ లొంగిపోదని తేల్చి చెబుతూ, ఇరాన్ లొంగిపోవాలనుకునే వారి కోరికను వారి సమాధులపైకి మళ్లిస్తాం అని ఆయన హెచ్చరించారు.  

అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగదని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడేందుకు అందరూ ఒక్కటై నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోకుండా అమెరికా, ఇజ్రాయెల్ ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ముఖ్య కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు. 

“మన దేశం, మన నేల, మన నీరు, మన గౌరవాన్ని కాపాడేందుకు అందరం కలిసి నిలవాలి. ఈ సంక్షోభం నుంచి ఇరాన్ గర్వంగా బయటపడేందుకు అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని లొంగిపోవాలని కలలు కంటున్నవారు ఆ కలల్ని సమాధి చేసుకోవాల్సిందే” అని పెజెష్కియన్ స్పష్టం చేశారు.  ఇటీవల అమెరకా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ తమ దేశం స్వాభిమానం ఉన్న దేశమని, ఎవరికి లొంగదని పెజెష్కియన్ స్పష్టం చేశారు.

“ప్రపంచ శక్తులు మనల్ని తల వంచమని బలవంతం చేయడానికి పిరికితనంతో వరుసలో ఉన్నాయి. మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నప్పుడు వంగి నమస్కరించనట్లే, ఈ సమస్యలకు మేము కూడా వంగి నమస్కరించము” అని ఆయన తేల్చి చెప్పారు.