4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్స్ నిలిపివేత

4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్స్ నిలిపివేత
పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో న్యూస్‌ చానళ్లకు నాలుగు వారాల పాటు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్‌పీ) నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. ఈ మేరకు రేటింగ్ ఏజెన్సీ అయిన ‘బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్’ (బార్క్) కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. 
 
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ ఘర్షణలకు సంబంధించి సంచలనాత్మక, కల్పిత రిపోర్టింగ్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీచేస్తూ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించే వార్తా కథనాలను అనేక న్యూస్‌ చానళ్లు ప్రసారం చేస్తున్నట్లు తాము గమనించామని పేర్కొన్నది.  యుద్ధ పరిణామాలను కవర్ చేస్తున్న కొన్ని టీవీ ఛానెళ్లు శృతి మించి వ్యవహరిస్తున్నాయని కేంద్రం గుర్తించింది. 
 
రేటింగ్‌ల కోసం యుద్ధాన్ని ఒక సినిమా తరహాలో, గ్రాఫిక్స్‌తో భయానకంగా చూపిస్తున్నాయని ప్రభుత్వం గమనించింది. దీంతో చర్యలకు ఉపక్రమించింది. 2014 నాటి ‘టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీల పాలసీ గైడ్‌లైన్స్’లోని క్లాజ్ 24.2 నిబంధన ప్రకారం ప్రభుత్వం ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రేటింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేయవచ్చు.

“ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో కొన్ని టీవీ ఛానళ్లు ‘అనవసరమైన సంచలనాత్మకత, ఊహాజనిత అంశాలను ప్రసాసం చేస్తున్నాయి. ఇటువంటి కథనాలు సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న వారు లేదా ఆ ప్రాంతాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిగిన వారిలో భయాందోళనలు కలిగించే అవకాశం ఉంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వార్తా ఛానళ్లకు సంబంధించిన టీఆర్‍పీ ఇవ్వడం నాలుగు వారాల పాటు కానీ, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కానీ తక్షణమే నిలిపివేయాలి” అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.

సాధారణంగా టీవీ ఛానళ్లకు వచ్చే ప్రకటనల ఆదాయం పూర్తిగా ఈ టీఆర్‌పీ రేటింగ్‌లపైనే ఆధారపడి ఉంటుంది. ఏ ఛానల్‌కు ఎక్కువ రేటింగ్ వస్తే, ఆ ఛానల్‌కు భారీగా యాడ్స్ వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. రేటింగ్‌ల కోసం పోటీ పడే క్రమంలో వార్తా ఛానళ్లు ఒకదానికొకటి పోటీ పడి మరీ ‘బ్రేకింగ్ న్యూస్’ పేరుతో సంచలనాలకు తెరలేపుతున్న వైనాన్ని నిత్యం చూస్తూనే ఉన్నాం.

తమ సుప్రీం లీడర్ మరణానికి ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ ఆస్తులపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ అంతర్జాతీయ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి సున్నితమైన సమయంలో, శాస్త్రీయ ఆధారాలు లేకుండా వార్తా సంస్థలు యుద్ధం ముగిసిపోతుందని, అణు యుద్ధం వస్తుందని చేసే ప్రసారాలు ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తాయని కేంద్రం భావించింది.