భారతీయ విద్యార్థులకు 69 శాతం తగ్గిన ఎఫ్‌-1 వీసాలు

భారతీయ విద్యార్థులకు 69 శాతం తగ్గిన ఎఫ్‌-1 వీసాలు

ట్రంప్‌ యంత్రాంగం వలసేతరులపై విధించిన కఠిన ఆంక్షలతో అమెరికా గతేడాది భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్‌-1 వీసాల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే గతేడాది జూన్‌-జులైలో జారీ చేసిన వీసాల సంఖ్య 69శాతం తగ్గినట్లు యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ విడుదల చేసిన డేటా తెలిపింది.  ఎఫ్‌-1వీసా అనేది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో గుర్తింపు పొందిన కళాశాలలు, యూనివర్శిటీలు లేదా స్పెషల్‌ లాంగ్వేజ్‌ కోసం  పూర్తి సమయం చదువుకునేందుకు జారీ చేసే వలసేతర, తాత్కాలిక వీసాలు.

గతేడాది జూన్‌-జులై మధ్య సుమారు 12,776 ఎఫ్‌-1వీసాలు జారీ చేసింది. ఇది 2024లో ఇదే సమయంలో జారీ చేసిన వీసాల సంఖ్య 41,336తో పోలిస్తే మూడో వంతు కంటే తక్కువ.  అమెరికన్‌ యూనివర్శిటీల్లో అకడమిక్‌ ఇయర్‌ ఆగస్టు-సెప్టెంబర్‌ మధ్య ప్రారంభమవుతుంది. అకడమిక్‌ ఇయర్‌ ప్రారంభానికి ముందు, 2025 జూన్‌లో ఈ సంఖ్య 10,695కాగా, జులైలో 2,081కి, ఆగస్టులో 2,389కి పడిపోయింది. 2024లో, జూన్‌లో 26,731 అత్యధిక నెలవారీ సంఖ్య కాగా, 2023 జూన్‌లో ఈ సంఖ్య 40,224గా ఉంది.  

కరోనా మహమ్మారి అనంతరం ఎఫ్‌-1 వీసాల జారీ పెరిగింది. 2021 జూన్‌ మరియు జులైలో 40,194 నుండి 2022లో ఆ నెలల్లో 62,229కి, 2023లో 72,027కి పెరిగింది. అయితే ట్రంప్‌ అధికారం చేపట్టక ముందే, 2024 జూన్‌, జులై నెలల్లో 41,336కి పడిపోయిందని డేటా తెలిపింది. కరోనా అనంతరం మార్చి నుండి మే వరకు భారతీయ విద్యార్థులకు జారీ చేసిన ఎఫ్‌-1 వీసాల సంఖ్య (9,906) ఆనెలల్లో కనిష్టస్థాయికి పడిపోయిందని, గతేడాది ఇదే నెలలతో పోలిస్తే 27శాతం తగ్గినట్లు జాతీయ మీడియా గతేడాది జులైలో పేర్కొంది.

ట్రంప్‌ అధికారం చేపట్టిన అనంతరం ఆంక్షల ఫలితంగా 2025 జూన్‌, జులైలో ఎఫ్‌-1 వీసాల .జారీలో భారీ తగ్గుదల కనిపించింది.  మే చివరి నుండి జూన్‌ 18న తిరిగి ప్రారంభించేవరకు కొన్ని వారాల పాటు వీసా దరఖాస్తుదారుల ఇంటర్వ్యూలను నిలిపివేశారు. జూన్‌ 23న ఎఫ్‌, ఎం, జె వీసాల దరఖాస్తుదారులు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లోని రహస్య సమాచారాన్ని పబ్లిక్‌ సెట్టింగ్‌లో ఉంచాలని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించిన సంగతి తెలిసిందే.

2024-25 అమెరికాలో 3.63లక్షల మంది భారతీయ విద్యార్థులు అంతర్జాతీయ సమూహంగా ఉన్నారు. మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో వీరు 31 శాతంగా ఉన్నారు. కాగా, విదేశీ ఐటీ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమెరికా హెచ్-1బి  వీసా రిజిస్ట్రేషన్లను యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్ సిఐఎస్) ప్రారంభించింది. అయితే, ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ పలు కీలక మార్పులు చేపట్టింది.