ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా ఘర్షణలతో పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అత్యాధునికి అణ్వాయుధ క్షిపణిని అమెరికా పరీక్షించింది. కాలిఫోర్నియా తీరంలో మార్చి 3న ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించగా దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ స్థావరం నుంచి మినిట్‌మ్యాన్-3 క్షిపణి పరీక్షను అమెరికా వైమానిక దళ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ నిర్వహించింది.
మార్షల్ దీవుల్లోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ ఖండాంతర క్షిపణి ఛేదించినట్లు అమెరికా స్పేస్‌ఫోర్స్ ప్రకటించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని క్షిపణి చేరుకుందని, ఈ పరీక్ష విజయవంతమైందని పేర్కొంది. దీనిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకోడానికే పరీక్షించినట్టు వివరించింది. అంతేకాదు, కొన్నేళ్ల కిందటే షెడ్యూల్ చేశామని, ప్రస్తుత పరిణామాలతో దీనికి సంబంధం లేదని తెలిపింది.
‘‘దశాబ్దాలుగా అమలులో ఉన్న డేటా ఆధారిత కార్యక్రమంలో కీలక భాగం. ఆయుధ వ్యవస్థ పనితీరును నిర్దారించడానికి రూపొందించిన 300 కి పైగా సారూప్య పరీక్షలు ఇందులో ఉంటాయి.. ఈ సాధారణ పరీక్షల నుంచి సేకరించిన డేటా భవిష్యత్తులో బలగాల అభివృద్ధికి చాలా అవసరం’’ అని ప్రకటనలో స్పష్టం చేసింది. పరీక్ష సమయంలో రెండు ఐసిబిఎం రీ ఎంట్రీ వాహనాలు మార్షల్ దీవులలోని క్వాజలీన్ అటోల్ వద్ద ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వేల మైళ్లు ప్రయాణించాయి.
‘‘ఈ దీర్ఘ-శ్రేణి క్షిపణి పరీక్ష ద్వారా ఇంజనీర్లు, ఆయుధ నిపుణులు దానికి ఖచ్చితత్వం, విశ్వసనీయతపై అమూల్యమైన డేటాను సేకరించడానికి వీలు కల్పిస్తుంది. ఐసిబిఎం ఆయుధ వ్యవస్థలోని ప్రతి భాగం రూపొందించిన ఏ విధంగా పనిచేస్తుందో లేదో ధ్రువీకరిస్తుంది’’ అని తెలిపింది.
కానీ, ఇరాన్‌పై దాడుల సమయంలోనే ఈ పరీక్షను నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మినిట్‌మ్యాన్-3 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిలో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వాహనం ఉంటుంది. ఇందులో అణ్వాయుధ పేలోడ్‌ను అమర్చవచ్చు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన వార్‌హెడ్‌లను ఇది మోసుకెళ్లగలదు.
గతంలో అనేకసార్లు దీనిని అమెరికా పరీక్షించింది. గతేడాది నవంబరులోనూ పరీక్ష నిర్వహించింది. గంటకు 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ ఖండాంతర క్షిపణి పరిధి 13 వేల కిలోమీటర్లు. అంటే దీని పరిధిలోకి భూగోళం మొత్తం వస్తుంది. దీనిని ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించగలదు. ఇది అమెరికా ఏకైక నాన్-మొబైల్, సైలో-ఆధారిత, భూ ఆధారిత, అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి.

More Stories
ఆరవ రోజు కూడా పరస్పరం భారీ ప్రేలుళ్ళు.. ఉధృతంగా వైమానిక దాడులు
సముద్ర మార్గాల్లో చిక్కుకుపోయిన 37 భారత నౌకలు
అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై భీకర దాడులు