ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో నిరసనలు జరిగాయి. ఖమేనీ హత్యకు వ్యతిరేకంగా శ్రీనగర్ సహా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది నిరసనకారులు వీధుల్లో శాంతియుతంగా కవాతు చేశారు. లాల్‌చౌక్ వద్దకు భారీగా చేరుకున్న షియా ముస్లింలు ఖమేనీకి సంతాపం తెలియజేశారు.
ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు అధికారులు తెలిపారు. లెహ్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో షియా ముస్లింలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇరాన్‌పై దాడులను ఖండిస్తూ ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఇరాన్‌కు సంఘీభావం తెలుపుతూ ఖమేనీ చిత్రాలు, నల్ల జెండాలు, ఇరాన్‌కు మద్దతిచ్చే బ్యానర్లతో ఈ నిరసనలు చేపట్టారు. అలాగే సంప్రదాయ సంతాప గీతాలను (నౌహా) ఆలపించారు.
“ఈ రోజు (ఆదివారం) మా ప్రియమైన నాయకుడు అలీ ఖమేనీ అమరుడయ్యారు. ఆయనకు శాంతియుతంగా సంతాపం తెలియజేస్తున్నాం.” అని ఓ నిరసనకారుడు అన్నాడు. విప్లవాత్మక సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఇక లేరని వార్త తెలిసిన నుంచి తామందరం చాలా బాధపడ్డామని మరో నిరసనకారుడు తెలిపాడు. అలాగే, ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన షియా మతాధికారి మౌలానా యూసుబ్ అబ్బాస్ సైతం ఖమేనీ మృతిపై స్పందించారు.
తాము బలిదానాలకు భయపడమని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకునే విధంగా తగిన సమాధానం ఇస్తామని ఇరాన్ గట్టిగా చెప్పిందని గుర్తు చేసుకున్నారు.
విస్తృత నిరసనల మధ్య పోలీసులు మొత్తం శాంతిభద్రతలను అంచనా వేస్తున్నందున జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్లో ప్రస్తుతం ఉన్న విద్యార్థులు సహా జమ్మూ కాశ్మీర్ నివాసితుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడానికి తన ప్రభుత్వం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సన్నిహిత సమన్వయంతో ఉందని అబ్దుల్లా తెలిపారు.
కాగా, పశ్చిమాసియాలో గగనతల ఆంక్షల నేపథ్యంలో భారత పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం 444 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. “ఇరాన్, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలపై గగనతల పరిమితుల కారణంగా ఫిబ్రవరి 28న దేశీయ విమానయాన సంస్థల 410 విమానాలు రద్దు అయ్యాయి. మార్చి 1న 444 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది.” అని పౌర విమానయాన శాఖ ఎక్స్ పోస్టులో పేర్కొంది.
More Stories
కూనో నేషనల్ పార్క్‌కు మరో 9 చీతాలు
బెంగాల్ లో 58 లక్షలకుపైగా ఓటర్ల తొలగింపు
హిసాత్మకంగా మారిన జెఎన్‌యు విద్యార్థుల లాంగ్ మార్చ్