కుటుంబ సభ్యులతో సహా ఖమేనీ మృతి

కుటుంబ సభ్యులతో సహా ఖమేనీ మృతి
 
* రక్షణ శాఖ మంత్రి, రివాల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌  కూడా హతం..ఇరాన్​లో సంబురాలు
 
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించడంతో పశ్చిమాసియా నెత్తురోడుతోంది. వందలాది మంది అమాయకులు బలవుతున్నారు. తాజాగా అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్‌ అధికారిక మీడియా ధ్రృవీకరించింది.  ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మరణించనట్లు వివరాలను వెల్లడించింది. ఖమేనీ మృతి 40 రోజుల సంతాప దినాలను ప్రకటించింది.  
ఇజ్రాయెల్‌, అమెరికా కలిసి పక్కా సమాచారంతోనే ఖమేనీని హతమార్చినట్లుగా సమాచారం. శనివారం ఖమేనీ తన కార్యాలయంలో సీనియర్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భావించి సంయుక్త దాడులకు దిగినట్లు అమెరికా అధికారవర్గాలు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.  వరుస దాడులతో దాడులతో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించిది. 
ఇరాన్‌ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆదేశ రక్షణ శాఖ మంత్రి అమీర్‌ నసీర్జాదే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇరాన్‌ రివాల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ మహ్మద్‌ పాక్‌పౌర్‌ కూడా దాడుల్లో మృత్యువాత పడినట్లు ఇరాన్‌ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. అలాగే ఇరాన్‌ పై ఇంకా దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించడంతో పశ్చిమాసీయాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఎర్పడ్డాయి.
 
ఇదిలా ఉండగా ఖమేనీ మృతికి సంబంధించి తమ దేశ సీనియర్‌ అధికారులకు స్పష్టమైన సమాచారం అందిదని ఇరాన్‌ ప్రకటనకు ముందు ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. ఆయన మృతదేహాన్ని ఇరాన్‌ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్రంప్‌, నెతన్యాహు చూశారని వెల్లడించింది. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహ్మద్ పక్పూర్ కూడా మరణించినట్లు సమాచారం. 

ఖమేనీని అమరవీరుడిగా ఇరాన్‌ ప్రభుత్వం అభివర్ణించింది. ఇరాన్‌ గొప్పనాయకుడు, పండితుడిని కోల్పోయినట్లు పేర్కొంది. ఖమేనీ హత్య, నిరంకుశులపై గొప్ప తిరుగుబాటుకు లాంచ్ ప్యాడ్ అవుతుందని ఇరాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది. ఈ పెద్ద నేరానికి సమాధానం చెప్పకుండా వదలబోమని ఇరాన్ క్యాబినెట్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఖమేనీ హతంతో ప్రభుత్వ మద్దతుదారులు విషాదంలో కూరుకుపోగా, మరికొన్ని చోట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఖమేనీ మరణ వార్త తెలియగానే ఇరాన్‌లోని ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు ఇరాన్ యువరాజు రెజా ఖమేనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు. ఇరాన్ సైన్యం (ఐఆర్‌జీసీ), పోలీసులు, భద్రతా దళాలు ఇకనైనా ప్రజలతో చేతులు కలపాలని ఆయన ప్రిన్స్ పిలుపునిచ్చారు. కూలిపోతున్న వ్యవస్థను కాపాడటానికి ప్రయత్నించొద్దని హితవు పలికారు.

మధ్యప్రాఛ్యంలో ఇరాన్‌ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. 1989లో ఆయతుల్లా రుహోల్లా ఖమేనీ మరణం తర్వాత పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను నాటకీయంగా మార్చేశారు. షియా ముస్లిం మతాధికారుల పాలనను పరిపుష్టం చేశారు. పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ను తన పాలనకు ఆధారమైన అతి ముఖ్యమైన సంస్థగా నిర్మించారు.

కాగా, పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్‌తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్‌ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగాయి. దీంతో టెహ్రాన్‌ అంతటా పేలుడు శబ్దాలు వినిపించాయి.

ఆపరేషన్‌ తొలిరోజే ఖమేనీ మృతిచెందినప్పటికీ పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. గల్ఫ్‌ అంతటా యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్‌ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ భారీ దాడులకు దిగాయి. ఇరాన్‌ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. గతానికి భిన్నంగా ఈసారి పగటి వెలుగులోనే అమెరికా దాడులకు దిగింది. 

 
ఇజ్రాయెల్-అమెరికా చేసిన దాడుల్లో దక్షిణ ఇరాన్​లోని బాలికల పాఠశాలలో 86 మంది విద్యార్థులు మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్​ఎన్​ఏ వెల్లడించింది.  అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు చేసిన కొద్ది గంటల తర్వాత ఇరాన్‌ ప్రతిదాడులకు దిగింది. తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్‌పై 200కుపైగా డ్రోన్లు, క్షిపణులు దూసుకెళ్లాయి. అందులో 35 ఇజ్రాయెల్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. 
 
ఈ దాడుల్లో 94 మందికి.. గాయాలయ్యాయి. తర్వాత బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈ సహా ఏడు దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడుల చేసింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్, యూఏఈ, ఇరాక్‌తో పాటు పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఖతార్, యూఏఈ, ఇజ్రాయెల్‌లలోని అమెరికా ఎంబసీల్లో సిబ్బందిని షెల్టర్లకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు.