కోకాపేటలోని జలమండలికి ఇచ్చిన భూములను రద్దు చేస్తూ ఆయా భూములను శారదాపీఠానికే కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శారదాపీఠం నిర్మాణాలపై ముఖ్యమంత్రి శనివారం సమీక్ష జరిపి సరైన వివరాలు ఇవ్వలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్‌బాబును కలిసి వివరాలు ఇవ్వాలని పీఠం ప్రతినిధులకు సీఎం రేవంత్ సూచించారు.
శారదా పీఠాన్ని కూల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బిఆర్ఎస్ నేత హరీష్ రావు, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి ఈ విషయమై దృష్టి సారించారు. కేసీఆర్ హయాంలో గండిపేట మండలం కోకాపేట నియాపోలిస్ లో విశాఖ శారదా పీఠానికి భూములను కేటాయించారు.
ఈ భూములను ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోడానికి సిద్ధమవుతుందని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కోకాపేట సర్వే నంబర్ 240లో రెండు ఎకరాల భూమిని శారదా పీఠానికి 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. వేద పాఠశాల, రాజశ్యామల అమ్మవారి ఆలయం, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అత్యంత విలువైన ఈ భూమిని ఎకరాకు ఒక్క రూపాయి చొప్పున నామమాత్రపు ధరకే ప్రభుత్వం అప్పగించింది.
వందల కోట్ల విలువైన భూములను ఉచితంగా ఇవ్వడంపై అప్పట్లోనే దుమారం రేగింది. దీనిపై హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ భూమిలో ఆలయ నిర్మాణం పూర్తిచేసి, అద్భుతంగా తీర్చిదిద్దుతామని అప్పట్లో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. అంతేకాదు, తన శేష జీవితాన్ని కూడా ఇక్కడే గడుపుతానని పేర్కొన్నారు.
ఈ భూముల సమీపంలోనే జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు కొంత మేర జరగడంతో ఈ అంశంపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శారదా పీఠం భూముల విషయంలో సరైన సమాచారం ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం శారదా పీఠంను సందర్శించి స్థానిక బీజేపీ కార్యకర్తలతో కలిసి పీఠానికి ఐక్యతాభావాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి గౌరవనీయమైన హిందూ ధార్మిక సంస్థ చుట్టూ ఈ రోజు కొన్ని చర్యల వల్ల అనవసర ఆందోళన నెలకొనడం అత్యంత దురదృష్టకరమని ఆయన తెలిపారు.
ఈ భూమీ విషయంలో ఎటువంటి జోక్యం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వివేకపూర్వక నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని ఆయన స్వాగతించారు. అదే సమయంలో పీఠాలు, మఠాలు, దేవాలయాలు వంటి మన సామూహిక విశ్వాసం మరియు సంప్రదాయాలపై నిలిచిన ధార్మిక సంస్థల వ్యవహారాల్లో అనవసర జోక్యం ఉండకూడదని పునరుద్ఘాటించారు.

More Stories
ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయింది
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు
నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం