బెంగాల్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగిసింది. దీంతో ఈసీ శనివారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 58,20,899 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బంగాల్లో మొత్తం 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 7.04 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తం 58 లక్షలకుపైగా ఫారాలు అందలేదని ఈసీ తెలిపింది.
24 లక్షలకు పైగా ఓటర్లు చనిపోయారని వెల్లడించింది. ఇతర కారణాల వల్ల మరికొంత మందిని జాబితా నుంచి తొలగించామని తెలిపింది. “మొత్తం 58,20,899 ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందలేదు. దాదాపు 24,16,852 మంది మరణించినవారిగా గుర్తించాం. 12,20,039 మంది గైర్హాజరు అయ్యారు. 19,88,076 మంది ఇతర ప్రాంతాలకు మారినట్లు నమోదు అయింది. 1,38,328 మంది ఇప్పటికే ఇతర చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించాం. అదనంగా 57,604 పేర్లు ఇతర కారణాలతో తొలగించాం” అని ఈసీ అధికారులు పేర్కొన్నారు.
2025 డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత, ఫారం-6, 6ఏ ద్వారా 1,82,036 మంది కొత్త ఓటర్లను చేర్చారు. ఫారం-8 ద్వారా 6,671 సవరణలు, చేర్పులు చేశారు. విచారణలో ఉన్న 60,06,675 మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చినట్లు ఈసీ వెల్లడించింది. ముసాయిదా జాబితా సమయంలో ఉన్నట్లుగానే లింగ నిష్పత్తి 956 వద్ద కొనసాగుతోందని తెలిపింది.
మరోవైపు, ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరును చేర్చడం, అనర్హులను పారదర్శకంగా తొలగించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. 100 శాతం భౌతిక ధృవీకరణ విధానాన్ని అనుసరించినట్లు వెల్లడించింది. బూత్ స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఫారమ్‌ల పంపిణీ, సేకరణ బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ సమగ్ర ప్రక్రియ ద్వారా మరణించిన వారు, శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, డూప్లికేట్ నమోదులు వంటి అనర్హ పేర్లను గుర్తించి తొలగించామని అధికారులు పేర్కొన్నారు.

More Stories
కూనో నేషనల్ పార్క్‌కు మరో 9 చీతాలు
హిసాత్మకంగా మారిన జెఎన్‌యు విద్యార్థుల లాంగ్ మార్చ్
ఆపరేషన్ సింధూర్‌లో ఎస్-400 ఫైరింగ్