ఎయిమ్స్ బీబీనగర్ నక్సల్ సానుభూతిపరుల ఆహ్వానంపై దుమారం 

ఎయిమ్స్  బీబీనగర్ నక్సల్ సానుభూతిపరుల ఆహ్వానంపై దుమారం 
* ‘సైద్ధాంతిక, రాజకీయ’ కంటెంట్‌ను నింపేందుకా?
చాలా మంది వైద్యులు, సిబ్బంది, వైద్య విద్యార్థులతో పాటు హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ బీబీనగర్‌తో సంబంధం ఉన్నవారు, హిందూ పండుగలు, సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థపై బహిరంగంగా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న విజ్ఞాన దర్శిని నాయకులు, నక్సల్ సానుభూతిపరులుగా పేరొందిన జయ రాజు, రమేష్ లను ఆహ్వానించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్, డీన్ నాయకత్వంలో, అనాటమీ విభాగం తమ తీవ్రవాద ధోరణులకు పేరుగాంచిన అటువంటి వ్యక్తులతో ఎలా సహకరిస్తుందనే దానిపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. అది కూడా మార్చి, 2026 చివరి నాటికి భారతదేశం ‘నక్సల్ రహిత’ దేశంగా మారాలని నిశ్చయించుకున్న సమయంలో, అందుకోసం దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో, వారి బలమైన కోటల నుండి వారిని దాదాపుగా తొలగించినటువంటి సమయంలో, అటువంటి కీలక సంస్థలో అటువంటి శక్తులకు వేదికలు సమకూర్చడం విస్మయం కలిగిస్తుంది. 
 
కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన వైద్య సంస్థల్లో ఒకదాని పరిపాలనలోని  కీలక వ్యక్తులు, తమ ‘కాలం చెల్లిన’, ప్రజలు తిరస్కరించిన భావజాలంకు పేరుగాంచిన అటువంటి శక్తులకు అవకాశం కల్పించడం హాస్యాస్పదంగా ఉంది. వారు మన సామాజిక జీవితంలోని దాదాపు అన్ని దశలలో ఆచరణాత్మకంగా తిరస్కరణకు గురవుతున్నారు. 
 
అలాంటి శక్తులను ఓ ప్రతిష్టాత్మక సంస్థ ఆహ్వానించడంలో ఉద్దేశ్యాన్ని చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. తమ వృత్తిలో లోతయిన పరిజ్ఞానం,  నైపుణ్యానికి పేరుగాంచిన వైద్య సమాజానికి వారు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మార్చి 31, 2026 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని ప్రకటించడంలో బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంపై తమ ఆందోళనలను వినిపించేందుకు దేశంలో ఎక్కడా తమ ముఖాన్ని చూపించడం కష్టంగా ఉన్న నక్సల్స్‌కు ఎఐఐఎంఎస్ ఓ వేదిక సమకూర్చాలని చూస్తున్నదా ?
 
 చట్టబద్ధ పరిపాలన, రాజ్యాంగ సంస్థలు, అణగారిన ప్రజల అభివృద్ధి పట్ల ఎటువంటి  నమ్మకం లేని నక్సల్స్ నిర్మూలనను అడవులు, గనులు, వన్యప్రాణులు వంటి సహజ వనరులను నాశనం చేయడానికి లేదా ఆదివాసీలను తమ ప్రకృతి యాజమాన్యంలోని స్థానిక ప్రదేశాల నుండి తరలించడానికే అంటూ వారు కుంటిసాకులు వెదుక్కొనేందుకు ఒక వేదికను కల్పించాలని చూస్తున్నారా? 
 
మరీ ముఖ్యంగా, ఇక్కడ తలెత్తే ప్రాథమిక ప్రశ్న ఏమిటంటే మెడికల్ విద్యార్థులకు ఇటువంటి కాలంచెల్లిన రాజకీయ, సైద్ధాంతిక సందేశాలు ఓ ప్రభుత్వ సంస్థలో అధికారికంగా అందించే ప్రయత్నం చేయడం అవసరమా? జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు విద్యా వేదికలను విద్య, పరిశోధన కోసం ఉపయోగించుకునేలా చూసుకోవాలి. విధ్వంసక లేదా రాజకీయ కథనాలను ప్రోత్సహించే శక్తులకు వేదికలు కల్పించడం ఏమాత్రం క్షంతవ్యం కాబోదు. అటువంటి ప్రయత్నాలు ఇటువంటి ప్రతిష్టాత్మక జాతీయ వైద్య సంస్థల ఏర్పాటు ఉద్దేశ్యానికే అంతరాయం కలిగించడమే కాగలదు.