చిలుకూరు ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

చిలుకూరు ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉన్న డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ పరమపదించారు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 90 ఏళ్ల సౌందరరాజన్ ఇంట్లోనే చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు విడిచారు. సౌందరరాజన్ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం రాజీలేని పోరాటం చేశారు.  అంతేకాకుండా హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కావాలని ఏకంగా ప్రభుత్వాలను సైతం ఎదిరించి నిలబడ్డారు.

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ‘వీసా బాలాజీ’గా తీర్చిదిద్దడంలో ఆయన కృషి మరువలేనిది అని చెబుతారు. 90 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఆలయ ధర్మం కోసం ఆయన అహర్నిషలు పరితపించేవారు.  దేవుడు అంటే బిజినెస్ కావద్దని విశ్వసించే అరుదైన అర్చకుడైన సౌందరరాజన్ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి 1998లో తన గుడిలో ఉన్న హుండీని తీసేసి వార్తల్లో నిలిచి సంచలనం సృష్టించారు.

కేవలం వాక్ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణను చేస్తామని ప్రపంచానికి నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను సౌందరరాజన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం అయ్యారు. డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ కేవలం ఒక ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు గొప్ప విద్యావేత్త కూడా. ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌గా సౌందరరాజన్ సేవలు అందించారు. తనకు ఉన్న మేధస్సును ధర్మాన్ని రక్షించేందుకు ఆయన ఉపయోగించారు.

ఆలయాల్లో వీఐపీ దర్శనాలకు వ్యతిరేకం అయిన సౌందరరాజన్ పేద, ధనిక తేడా లేకుండా గుడికి వచ్చే అందరు భక్తులను ఒకే వరుసలో నిలబెట్టి, దర్శనాలు కల్పించిన అరుదైన ఘనత ఆయన సొంతం.  ఆలయానికి వచ్చే భక్తులు అందరికీ సమానంగా స్వామి వారి దర్శనం కల్పించే సంప్రదాయాన్ని ఆయన తీసుకువచ్చారు. కళ్లు తెరిచి స్వామి వారిని చూడండి.. కళ్లు మూసుకుని కాదు అంటూ ఆయన మాట్లాడే మాటలకు ఎంతో మంది భక్తులచే ప్రశంసలు అందుకున్నారు. 

స్వామి వారిని నిదానంగా, ప్రశాంతంగా చూడండి అని, కళ్లారా స్వామిని చూసి తనివితీరా మొక్కండి అంటూ ఆయన మాట్లాడే మాటలు ఆలయంలో వినిపిస్తూనే ఉంటాయి.  ఇక ఆలయ స్వయం ప్రతిపత్తి విషయంలో డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ రాజీలేని పోరాటం చేశారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తే తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అని ధైర్యంగా తేల్చి చెప్పారు.

టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం ఆయన నడుం బిగించారు. ముగ్గురు మగపిల్లల్లో రంగరాజన్ (ప్రస్తుత ఆలయ ప్రధాన అర్చకులు) రెండో వాడు. వంశపారంపర్య అర్చక కుటుంబంలో జన్మించిన ఆయన, తన తండ్రి రాఘవాచారి నుంచి లభించిన ఆధ్యాత్మిక విలువలతో చిలుకూరు ఆలయాన్ని ఒక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దారు.

సమాజంలో కుల వివక్షను రూపమాపేందుకు ఒక దళిత భక్తుడిని తన భుజాలపై మోసుకుని ఆలయ ప్రవేశం చేయించి ‘మునివాహన సేవ’ ద్వారా చరిత్ర సృష్టించారు. ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి చట్టపరమైన పోరాటాలు చేసిన ఆయన, అర్చక హక్కుల పరిరక్షణలో అగ్రగామిగా నిలిచారు. ఒక ఇంజనీర్ తార్కికతను, అర్చకుడి ఆధ్యాత్మికతను జోడించి చిలుకూరు క్షేత్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చారు.

భౌతికంగా డాక్టర్ ఎంవీ సౌందరరాజన అందరికీ దూరం అయినప్పటికీ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆయన నేర్పించినన 11 ప్రదక్షిణల సంకల్పం,108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నాయి. ఇక ఆయన వారసుడు సీఎస్ రంగరాజన్ ప్రస్తుతం తండ్రి సౌందరరాజన్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక నిబద్ధత గల అర్చకుడిగా, విద్యావేత్తగా, ధర్మకర్తగా సౌందరరాజన్ గారి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.