డీఎంకేలో చేరిన జయ నమ్మినబంటు పన్నీర్‌సెల్వం

డీఎంకేలో చేరిన జయ నమ్మినబంటు పన్నీర్‌సెల్వం

దివంగత సీఎం జయలలితకు అత్యంత నమ్మకస్తుడిగా గుర్తింపు పొందిన, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో చేరారు. అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే)లో ఆయన శుక్రవారం అధికారికంగా చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సమక్షంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఓపీఎస్‌కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

అన్నాడీఎంకేలో కీలక పదవులు నిర్వహించిన పన్నీర్‌సెల్వం,  దివంగత నేత జయలలితకు, ఆమె పార్టీ ఏఐఏడీఎంకేకు పనీర్ సెల్వం అత్యంత విధేయుడిగా ఉండేవారు. ఆమె జైలులో ఉన్న సమయంలో పనీర్ సెల్వం ముఖ్యమంత్రిగా చేశారు. మొత్తం మూడుసార్లు ఆయన సీఎంగా చేశారు. జయలలిత మరణం అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ సీఎం పళనిస్వామికి, పనీర్ సెల్వంకు మధ్య విబేధాలు తలెత్తాయి.

ఇదే సమయంలో పార్టీలో పనీర్ వర్గం, పళని స్వామి వర్గం అంటూ రెండు గ్రూపులు తయారయ్యాయి. ఈ విబేధాలు కొంతకాలం క్రితం పనీర్ సెల్వంను 2022లో బహిష్కరించే వరకు వెళ్లింది. బహిష్కరణ అనంతరం పనీర్ తిరిగి ఏఐఏడీఎంకేలోకి చేరాలని భావించినా పళనిస్వామి సానుకూలంగా స్పందించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పనీర్ సెల్వం తన కుమారుడు, తన అనుకూల నేతలతో కలిసి డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తన కుమారుడు పి. రవీంద్రనాథ్ కుమార్, మాజీ ఎంపీ రవీంద్ర నాథ్, ఎమ్మెల్యే అయ్యప్పన్, ఇతర కీలక నేతలు కూడా డీఎంకేలో చేరారు.

డీఎంకేలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఓపీఎస్, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె. పళనిస్వామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “పార్టీకి భవిష్యత్‌లో ఎలాంటి విజయం దక్కకుండా చేసే పరిస్థితిని పళనిస్వామి సృష్టించారు. ఆయన నిరంకుశుడు, అహంకారి. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు” అంటూ మండిపడ్డారు. గతంలో తనకు జరిగిన విషయాల గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఇకపై సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు పని చేస్తానని స్పష్టం చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పనీర్ సెల్వం డీఎంకే తరఫున తన సొంత నియోజకవర్గమైన బోడి మెట్టు నుంచి పోటీ చేయనున్నారు. పనీర్ చేరికతో దక్షిణ తమిళనాడులో డీఎంకేకు ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అక్కడ తేవార్ల ఆధిపత్యం ఎక్కువ. దీంతో తేవార్లకు చెందిన పనీర్ సెల్వం ఓటు బ్యాంకు కలిసొస్తుందని పార్టీ విశ్వాసం.