ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు.. ట్రంప్ నైరాశ్యం

ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు.. ట్రంప్ నైరాశ్యం
“నేను ఎంతకాలం ఉంటానో తెలియట్లేదు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నైరాశ్యం వ్యక్తం చేశారు. మార్‌-ఎ-లాగో రిసార్ట్‌ లోకి తుపాకీతో చొరబడేందుకు ప్రయత్నించిన ఆగంతుకుడిని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు కాల్చి చంపిన ఘటనపై డొనాల్డ్‌ ట్రంప్‌ తొలిసారి స్పందించారు. ఈ భద్రతా లోపంపై ఆయన కాస్త ఆందోళన, మరికాస్త వ్యంగ్యంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. 
 
వైట్‌ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ ”నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ (జీవించి) ఉంటానో నాకు తెలియదు. నా కోసం తుపాకులు పట్టుకుని ఎంతమంది వేచి చూస్తున్నారో చూశారుగా?” అని వ్యాఖ్యానించారు. గొప్ప నాయకులకే ఇలాంటి ముప్పు ఉంటుందని, అబ్రహం లింకన్‌, కెన్నడీ వంటి ‘ప్రభావశీల’ అధ్యక్షులనే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. 
 
”బహుశా నేను కొంచెం తక్కువ ప్రభావశీల నాయకుడిగా ఉంటే బాగుండేదేమో. కాసేపు సాధారణ అధ్యక్షుడిలా ఉందాం” అని చమత్కరించారు. ఫిబ్రవరి 22 తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఆస్టిన్‌ టక్కర్‌ మార్టిన్‌ (21) అనే యువకుడు షాట్‌ గన్‌, ఇంధనం క్యాన్‌తో మార్‌-ఎ-లాగో ప్రహరీని దాటేందుకు ప్రయత్నించాడు. భద్రతా దళాలు హెచ్చరించినప్పటికీ, అతడు లొంగకుండా తుపాకీని ఎక్కుపెట్టడంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో మార్టిన్‌ అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో ట్రంప్‌ దంపతులు వైట్‌ హౌస్‌లో ఉన్నారు. గతంలో కూడా ట్రంప్‌పై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజా ఘటనలో చనిపోయిన యువకుడు ఎప్‌ స్టీన్‌ ఫైల్స్‌ విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై అసహనంతో ఉన్నట్లు కొన్ని టెక్ట్స్‌ మెసేజ్‌ల ద్వారా వెల్లడయ్యింది.