నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో పసికందు ప్రాణాలు కోల్పోయే స్థాయికి దాడి జరగడం అత్యంత హృదయ విదారకమని, ఇది సమాజం మొత్తం సిగ్గుతో తలవంచుకునే దుస్థితిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జరగాల్సిన మల్లికార్జున స్వామి జాతరలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన కారణంగా ఈ దారుణ సంఘటన చోటుచేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ఘటనలో గణేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో పాటు, రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత విషాదకరమని తెలిపారు. అధికార పార్టీకి చెందిన వారమన్న అహంకారంతో, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ దౌర్జన్యం సాగిందని రావు ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి, బాధితులపైనే అక్రమంగా కేసులు నమోదు చేయడం తీవ్ర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులనే ముద్దాయిలుగా మారిస్తే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
ఈ ఘటనలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని బిజెపి నేత విమర్శించారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం విఫలమైందని ధ్వజమెత్తారు. హిందూ ధర్మంలో అన్ని కులాలు ఒక్కటేనని, దేవాలయాలు అందరికోసం, అన్ని కులాల కోసమేనని స్పష్టం చేశారు. అటువంటి దేవాలయాల్లో కులవివక్ష ఉంటే, అది హిందూ ధర్మానికి మచ్చగా మారుతుందని అన్నారు.
దేవాలయాలపై దాడులు చేసే వాళ్లు వ్యక్తులే గానీ, హిందూ సమాజం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. గుడి దగ్గరైనా, బడి దగ్గరైనా కుల వివక్షకు ఎలాంటి స్థానం ఉండకూడదని పేర్కొంటూ పేద-ధనిక అనే భేదభావం లేకుండా, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. హిందూ మతంలో అందరికీ స్థానం ఉంటుందని, ఎక్కడైనా వివక్ష కనిపిస్తే దాన్ని అంతం చేసే పోరాటంలో బిజెపి ముందువరుసలో ఉంటుందని హెచ్చరించారు.

More Stories
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
హైదరాబాద్ టూ గోవా కేవలం 8 గంటల్లోనే.. గ్రీన్ ఫీల్డ్ హైవే
7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందిన అల్లు అర్జున్