‘మిస్టర్ ట్రంప్.. అధ్యక్షుడిగా మీ పాలన ఏం బాగాలేదు. మీ నిర్ణయాలు, కార్య నిర్వహణపై పూర్తి అసంతృప్తిగా ఉన్నాం’ అని కుండబద్దలు కొడుతున్నారు అక్కడి భారతీయులు. అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ పాలనపై కార్నెగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ విడుదల చేసిన 2026 ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) వివరాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ ‘యూగవ్’ భాగస్వామ్యంతో ఈ సర్వే జరిగింది.
ఈ సర్వేలో 71 శాతం ఇండో అమెరికన్లు ట్రంప్ పాలన పట్ల పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు ఆయన పాలన ఎంతమాత్రం ఆమోద యోగ్యంగా లేదని స్పష్టం చేశారు. వెయ్యి మంది ఇండో అమెరికన్లను సర్వేలో ప్రశ్నించగా 29 శాతం మంది మాత్రమే అధ్యక్షుడిగా ట్రంప్ పాలన సంతృప్తికరంగానే ఉందని తెలిపారు. మిగతా 71 శాతం మాత్రం ఆయన పాలనపై పెదవి విరిచారు. గత డిసెంబర్ నుంచి నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం అమెరికన్ల కంటే భారతీయులే ట్రంప్‌కు ఎక్కువగా విమర్శించారు.
64 శాతం మంది ఆయన ఇమిగ్రేషన్ విధానాన్ని విమర్శించారు. 68 శాతం దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 70 శాతం మంది ట్రంప్ అంతర్జాతీయ ఆర్థిక విధానాలు ముఖ్యంగా వాణిజ్యం, సుంకాలు తదితర విషయాలపై అ దేశ విపక్షాల కన్నా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాల విషయంలో ట్రంప్ విధానాలను 55 శాతం మంది వ్యతిరేకించారు.
ముఖ్యంగా అమెరికా-భారత్ సంబంధాల్లో ఉద్రిక్తతలు, దేశీయ విధాన మార్పులు, ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలను ఈ సందర్భంగా పలువురు భారతీయులు ప్రస్తావించినట్టు నివేదిక పేర్కొంది. యూఎస్‌లో తాము వివక్షను ఎదుర్కొన్నామని 27 శాతం మంది తెలిపారు.

More Stories
ముంబయి దాడుల సూత్రధారి రాణాకు కెనడా పౌరసత్వం రద్దు!
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుపి
యూనుస్ చర్యలన్నీ చట్టవ్యతిరేకమే