ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ)- 1977 ప్రకారం ట్రంప్ పెంచిన సుంకాల వసూలును ఇక ఆపేస్తామని తెలిపింది. దిగుమతి సుంకాలను పెంచుతూ గతంలో ప్రెసిడెంట్ ట్రంప్ జారీచేసిన మార్గదర్శకాలన్నీ డియాక్టివేట్ అవుతాయని వెల్లడించింది. సుంకాల బాదుడును ఆపమంటూ గత శుక్రవారమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలు వెలువడిన మూడు రోజుల తర్వాత తీర్పు అమలు దిశగా ట్రంప్ సర్కారు ప్రకటన చేసింది.
ఈ వ్యవధిలో (ఫిబ్రవరి 20 – 23 వరకు) అమెరికాకు వస్తు, సేవలను ఎగుమతి చేసిన ప్రపంచ దేశాల నుంచి పాత లెక్క ప్రకారమే అధిక సుంకాలను వసూలు చేశారు. ఈ మూడు రోజుల్లో అదనంగా వసూలు చేసిన సుంకాన్ని ఆయా దేశాలకు తిరిగి చెల్లిస్తారా, చెల్లించారా అనే దానిపై అమెరికా కస్టమ్స్ విభాగం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఐఈఈపీఏ-1977 ప్రకారం ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలకు మాత్రమే ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
సెక్షన్ 232 జాతీయ భద్రతా అధికారాలు, సెక్షన్ 301 అన్ ఫెయిర్ ట్రేడ్ స్టాచ్యూట్స్ ప్రకారం ట్రంప్ పెంచిన సుంకాలకు ఈ సడలింపు వర్తించదని తేల్చి చెప్పింది. గత శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్ జారీచేసిన సంచలన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ప్రపంచ దేశాలపై విధించే దిగుమతి సుంకాన్ని 10 శాతం చేశారు. అయితే శనివారం ఉదయం ట్రంప్ మళ్లీ మాట మార్చి దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతానని తెలిపారు.
ట్రేడ్ యాక్ట్ – 1974లోని సెక్షన్ 122 ప్రకారం అమెరికా వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు ఈ సుంకం వసూలును అమలు చేస్తానని పేర్కొన్నారు. 150 రోజుల పాటు ఈ కొత్త సుంకం రేటు అమల్లో ఉంటుందని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం అమెరికా ఖజానాపైనా పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ దేశాలపై అధిక సుంకాల బాదుడుతో ట్రంప్ సర్కారు ఆర్జించిన ఆదాయంలో రూ.15.88 లక్షల కోట్లను రీఫండ్ చేయాల్సి రావచ్చని పలువురు నిపుణులు అంటున్నారు. అధిక దిగుమతి సుంకాల విధింపు వల్ల ప్రస్తుతానికి ప్రతిరోజు రూ.4,538 కోట్లు చొప్పున అమెరికా ఖజానాలోకి చేరుతున్నాయని వారు గుర్తు చేస్తున్నారు.

More Stories
భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా
సుంకాలు 15 శాతానికి పెంచేసిన ట్రంప్
మూడు భారీ ఇరాన్ చమురు నౌకలను పట్టుకున్న భారత్