రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత
పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుపొందిన నాయకుడు, రైల్వే మాజీ మంత్రి, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ముకుల్‌ రాయ్‌ ఇకలేరు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 ఏళ్ల రాయ్‌.. సోమవారం తెల్లవారుజామున హుద్రోగంకు గురై కన్నుమూశారు. ముకుల్ రాయ్‌ కుమారుడు సుబ్రాన్ష్‌ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

రాయ్‌ మరణవార్త తెలిసి పశ్చిమబెంగాల్‌కు చెందిన పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్‌ రాయ్‌ ఒకరు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జికి ఆయన అత్యంత నమ్మకస్తుడు. మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఒక శక్తిమంతమైన వ్యూహకర్తగా కూడా నిలిచారు. ముఖ్యంగా టీఎంసీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. పార్టీలో మమత తర్వాత రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు.

యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. బెంగాల్‌లో టీఎంసీని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి అనన్యసాన్యం.  టీఎంసీలో రెండో అత్యంత శక్తిమంతమైన నేతగా పేరొందిన ముకుల్‌ రాయ్‌ 2017లో పార్టీని వీడి అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేశారు. 

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఆయన బెంగాల్‌లో పార్టీని విస్తరించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్‌లో 18 స్థానాల్లో గెలుపొందింది. 2021లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌ బీజేపీ నుంచే పోటీ చేసి విజయం సాధించారు.  అయితే, అదే ఏడాది మళ్లీ తృణమూల్‌ కాంగ్రెస్‌ గూటికి తిరిగొచ్చారు. కేంద్రంలో యూపీఏ సర్కారు రెండో దఫా అధికారంలో ఉన్న సమయంలో రైల్వే శాఖ మంత్రిగా వ్యవహరించారు.

2023లో డిమెన్షియా బారిన పడిన ఆయన అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. డిమెన్షియా కారణంగా గత ఏడాది ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని కూడా కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. ముకుల్ రాయ్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముకుల్ ఒక గొప్ప సహచరుడు. ఆయన మరణం మా పార్టీకి, వ్యక్తిగతంగా నాకు తీరని లోటు” అని పేర్కొన్నారు.

ముకుల్ రాయ్ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ అనుభవం, సమాజానికి చేసిన సేవ, కృషికి గాను ఎప్పటికీ గుర్తుంటారని పేర్కొన్నారు.