ఆసీస్‌పై తొలిసారి టీ20 సిరీస్‌ భారత మహిళల కైవసం

ఆసీస్‌పై తొలిసారి టీ20 సిరీస్‌ భారత మహిళల కైవసం

భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసారి టీ20 సిరీస్‌ను దక్కించుకుని ఔరా అనిపించుకుంది. ఓవరాల్‌గా కంగారూలపై రెండో సిరీస్‌ కైవసం చేసుకుని కొత్త అంకాన్ని లిఖించింది.

దీనికి ముందు ఇక్కడ ఆడిన ఏ ఫార్మాట్‌లోనూ భారత్ మహిళల జట్టు ఎప్పుడూ సిరీస్‌ నెగ్గలేదు. ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​లో భారత్ నెగ్గగా, రెండో టీ20లో ఆసీస్ విజయం సాధించింది. ఇక సిరీస్ డిసైడర్ అయిన తాజా టీ20లో నెగ్గిన హర్మన్​ సేన మూడు మ్యాచ్​ల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.  శనివారం జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20 పోరులో టీమ్‌ఇండియా 17 పరుగుల తేడాతో ఆసీస్‌పై చారిత్రక విజయం సాధించింది.
తొలుత స్మృతి మందన (55 బంతుల్లో 82, 8ఫోర్లు, 3సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడు జెమీమా రోడ్రిగ్స్‌(46 బంతుల్లో 59, 4ఫోర్లు) అర్ధసెంచరీతో భారత్‌ 20 ఓవర్లలో 176/6 భారీ స్కోరు నమోదు చేసింది.  19 పరుగులకే ఓపెనర్‌ షెఫాలీవర్మ(7) వికెట్‌ కోల్పోయిన భారత్‌ను మందన, రోడ్రిగ్స్‌ ఆదుకున్నారు. ఆసీస్‌ బౌలింగ్‌ను దీటుగా నిలువరిస్తూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు.
సూపర్‌ఫామ్‌మీదున్న వీరిద్దరు బౌండరీలే లక్ష్యంగా చెలరేగడంతో కంగారూ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. మందన, రోడ్రిగ్స్‌ కలిసి రెండో వికెట్‌కు 121 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సదర్లాండ్‌ బౌలింగ్‌లో మందన ఔట్‌ కావడంతో వీరి జోరుకు బ్రేక్‌ పడింది. క్రీజులో ఉన్నంతసేపు రీచా ఘోష్‌(7 బంతుల్లో 18, 2ఫోర్లు, సిక్స్‌) దూకుడుగా ఆడింది. రోడ్రిగ్స్‌, అమన్‌జ్యోత్‌(1), దీప్తిశర్మ(1) వెంటవెంటనే ఔటయ్యారు. సదర్లాండ్‌(2/34) రెండు వికెట్లు తీసింది. లక్ష్యఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 159/9 స్కోరుకు పరిమితమైంది. 

శ్రేయాంక పాటిల్‌(3/22), శ్రీచరణి (3/32), అరుంధతిరెడ్డి(2/35) ధాటికి ఆసీస్‌ బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయారు. ఆశ్లే గార్డ్‌నర్‌(57) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. జార్జియా వోల్‌(10), మూనీ(6), ఎలీస్‌ పెర్రీ(1), వేర్‌హామ్‌(12), సదర్లాండ్‌(14) స్వల్ప స్కోర్లకు పరిమితమయ్యారు. మందనకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు సిరీస్‌ దక్కింది. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌ ఈనెల 24 నుంచి మొదలుకానుంది.