సుంకాలు 15 శాతానికి పెంచేసిన ట్రంప్

సుంకాలు 15 శాతానికి పెంచేసిన ట్రంప్

ప్రపంచ దేశాలపై ట్రంప్ సర్కార్ విధిస్తున్న టారిఫ్ లు చెల్లవని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సుప్రీం తీర్పుపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన కొద్ది గంటల్లోనే, అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ట్రంప్ ఈ సుంకాలను తాజాగా 15 శాతానికి పెంచారు.

ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌ సోషల్‌లో నిర్ణయాన్ని ప్రకటిస్తూ పోస్టు షేర్ చేశారు. కోర్టు తాజా తీర్పును హాస్యాస్పదంగా పేర్కొన్న ఆయన, తీర్పును క్షుణ్నంగా, పూర్తిగా సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే పెరిగిన ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో చట్టబద్ధమైన సుంకాలనూ జారీ చేస్తామని అన్నారు.

కాగా, ఆయా దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి టారిఫ్లు విధించడాన్ని తప్పుబట్టిన కోర్టు, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఆయన విధించిన టారిఫ్లను కొట్టివేస్తూ, చీఫ్ జస్టీస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని బెంచ్ 6:3 మెజారిటీతో తీర్పు వెలువరించింది. దీంతో ట్రంప్ అతిపెద్ద ఆర్థిక నిర్ణయానికి అడ్డుకట్ట పడినట్లైంది. అయితే ఈ తీర్పుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తీర్పు వెలువడ్డ కొద్ది గంటల్లోనే 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. వాటిని తాజాగా 15 శాతానికి పెంచారు.