కుత్రిమ మేధ (ఏఐ), సెమీకండక్టర్ తయారీ రంగంలో అద్భుత పురోగతి సాధించే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఈ రంగాల్లో అగ్రగామి దేశాలు సభ్యులుగా ఉన్న ‘పాక్స్ సిలికా’ కూటమిలో భారత్ చేరింది. ఏఐ, కీలక ఖనిజాల కోసం అమెరికాతో చారిత్రక ఒప్పందం ఖరారు చేసుకుంది. తద్వారా ఏఐ, కీలక ఖనిజాలు, సరఫరా చెయిన్, భద్రత, ఆర్థిక రంగాల్లో కూటమిలోని సభ్యదేశాల నుంచి భారత్ గొప్ప సహకారం పొందే అవకాశం దక్కించుకుంది.
ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఈ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, భారత్‌లోని యూఎస్ రాయబారి సెర్గియో గోర్, అమెరికా ఆర్థిక వ్యవహారాల సహాయ మంత్రి జాకబ్ హెల్బర్గ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ పాక్స్ సిలికా అనేది సామర్థ్యాల కలయికగా అభివర్ణించారు.
స్వేచ్ఛాయుత ప్రజలు ఏకమైతే భవిష్యత్తు వారిదే అవుతుందని చెప్పడానికి పాక్స్ సిలికా ఒక నిదర్శనమని అమెరికా మంత్రి జాకబ్ హెల్బర్గ్ వ్యాఖ్యానించారు. “వాణిజ్య ఒప్పందం నుంచి ప్యాక్స్ సిలికా వరకు, అలాగే రక్షణ సహకారం వరకు మన రెండు దేశాలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ప్యాక్స్ సిలికాలో భారత్ చేరడం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గమనాన్ని మరింత వేగవంతం చేసే వ్యూహాత్మక ముందడుగు” అని గోర్ తెలిపారు.
“భారత్ అపారమైన ప్రతిభ కలిగిన దేశం. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉంది. ఈ కూటమికి భారత్ ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంతో కీలకం. ప్రతిభతో పాటు, క్లిష్టమైన ఖనిజాల ప్రాసెసింగ్ సామర్థ్యంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. దీనిపై మేము పూర్తిస్థాయిలో కలిసి పనిచేస్తున్నాం. ప్యాక్స్ సిలికా ఫ్రేమ్‌వర్క్ కింద నమ్మకమైన ఏఐ సాంకేతికతలను అమెరికా, భారత్‌తో పంచుకుంటుంది” అని వివరించారు.
“మా మిత్రదేశాలు ఆర్థిక ఒత్తిళ్లు, బెదిరింపులను ఎదుర్కోవడం మేము గమనిస్తున్నాం. వారు తమ సార్వభౌమాధికారం లేదా శ్రేయస్సులో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచ సరఫరా గొలుసు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందుకే నేడు ప్యాక్స్ సిలికా డిక్లరేషన్‌పై సంతకం చేస్తూ, బ్లాక్ మెయిలింగ్‌కు ‘నో’ చెబుతున్నాం. ఆర్థిక భద్రతే జాతీయ భద్రత అని మేము చాటిచెబుతున్నాం” అని జాకబ్ హెల్బర్గ్ వివరించారు.
ప్రధాని మోదీ కృషితో యావత్ ప్రపంచం భారత్‌పై పూర్తి విశ్వాసం కనబరుస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ క్రమంలో కుదిరిన ఈ ఒప్పందం వల్ల భారత్‌లో సెమీకండక్టర్ తయారీకి అనువైన వాతావరణం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కీలక ఖనిజాలు, ఏఐ కోసం సురక్షితమైన, వినూత్నమైన, నమ్మకమైన ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో 2025 డిసెంబర్‌లో ‘పాక్స్ సిలికా’ కూటమిని ప్రారంభించారు. గతేడాది డిసెంబర్ 12న వాషింగ్టన్‌లో జరిగిన పాక్స్ సిలికా సమ్మిట్‌లో భాగస్వామ్య దేశాలు ఈ డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. ఇందులో ఆస్ట్రేలియా, గ్రీస్, ఇజ్రాయెల్, జపాన్, ఖతార్, దక్షిణ కొరియా, సింగపూర్, యూఏఈ, యూకే సభ్య దేశాలుగా ఉన్నాయి.
ముడి సరుకుల నుంచి సెమీకండక్టర్లు, ఏఐ మౌలిక సదుపాయాల వరకు అన్ని దశల్లో ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం ఈ కూటమి ప్రధాన లక్ష్యం. దీర్ఘకాలిక శ్రేయస్సుకు కృత్రిమ మేధస్సు ఒక పరివర్తనాత్మక శక్తి అని గుర్తిస్తున్నట్లు సభ్య దేశాలు ప్రకటించాయి. భద్రత, అభివృద్ధిని కాపాడుకోవడానికి నమ్మకమైన ఏఐ వ్యవస్థలు ఎంతో కీలకమని పేర్కొన్నాయి.

More Stories
షర్టులు విప్పి ఏఐ సమ్మిట్‌లోకి దూసుకెళ్లిన యూత్ కాంగ్రెస్
ఏ ఒక్క నౌకాదళం కూడా ఒంటరిగా సవాళ్లను ఎదుర్కోలేదు
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు