మే 5 నుండి 7వరకు సుప్రీం సిఎఎ పిటిషన్ల విచారణ 

మే 5 నుండి 7వరకు సుప్రీం సిఎఎ పిటిషన్ల విచారణ 

పౌరసత్వ సవరణ చట్టం-2019, నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు మే 5వతేదీకి షెడ్యూల్‌ చేసింది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ 250కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. మే 5 నుండి 7వరకు పిటిషన్లను వరుసగా విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. 

తీర్పు రిజర్వ్‌ చేయడానికి ముందు ప్రతివాదనలను వినిపించేందుకు మే12న తిరిగి విచారణ చేపడతామని పేర్కొంది. మొదట సిఎఎపై సాధారణ పిటిషన్లను విచారిస్తామని, అనంతరం అస్సాం, త్రిపురలో సిఎఎకి సంబంధించిన క్లిష్టమైన సమస్యలను పరిశీలిస్తామని తెలిపింది. ఈ కేసు చివరిసారిగా మార్చి 2024లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ చట్టం 2019లో అమల్లోకి వచ్చిందని, మోదీ ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత చట్టంలోని నిబంధనలను వెల్లడించిందని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ఈ చట్టం కింద పౌరసత్వం మంజూరు చేపడితే, దానిని తిప్పికొట్టలేమని గురువారం మౌఖికంగా పేర్కొన్నారు. మతం ఆధారంగా పౌరసత్వం మంజూరు  చేస్తూ వివక్షచూపుతుందనే కారణంతో సిఎఎ చట్టం 2019 చట్టబద్ధతను సవాలు చేస్తూ ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ ప్రాథమిక పిటిషన్‌ దాఖలు చేసింది.

అనంతరం 237 ప్రత్యేక పిటిషన్లు దాఖలయ్యాయి.  సీనియర్ న్యాయవాది  కపిల్‌ సిబల్‌ ముస్లిం లీగ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో న్యాయవాది హరిస్‌ బీరాన్‌ కూడా రాజకీయ పార్టీ తరపున హాజరయ్యారు. న్యాయవాది సుభాష్‌ చంద్రన్‌ కె.ఆర్‌. ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈ చట్టం అమలుపై మధ్యంతర స్టే కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది.