వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ
అమెరికా రాజకీయాల్లో పలువురు భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో ఉన్నారు. ఇటీవల న్యూయార్క్ మేయర్ గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామదానీ ఎన్నికైన తర్వాత తాజాగా, మరో భారత సంతతికి చెందిన మహిళ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తమిళ మూలాలున్న రిని సంపత్ (31) బుధవారం తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.
డెమొక్రాట్ల ప్రైమరీలో అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రిని రాజధాని నగరంలో మౌలిక వసతులను పెంచడం, పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించడమే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ప్రస్తుత నగర నాయకత్వంపై విమర్శలతో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.  “నగర పాలనలో మేయర్‌గా కనీస హామీలను నెరవేర్చడమే నా ప్రాధాన్యత. రహదారులపై గుంతలు పూడ్చడం, మురుగునీటి సమస్యను పరిష్కరించడం, నిత్యావసరాల ధరలు తగ్గించడం, అత్యవసర సహాయం 911 కాల్స్ వెయిటింగ్ సమయం తగ్గించడం వంటివి చేస్తాను’’ అని రిని సంపత్ వాగ్దానం చేశారు.
 
విధి నిర్వహణలో ప్రాథమిక విధులు నిర్వర్తించడంలో విఫలమైన ఉద్యోగులకు పదోన్నతలు ఎందుకు ఇవ్వాలని ఆమె నిలదీశారు. నగర కౌన్సిల్‌లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న రాజకీయ నేతలపై పరోక్షంగా ఆమె విమర్శలు గుప్పించారు.  ఇటీవల సంభవించిన మంచు తుపానుతో రహదారులు, ఫుట్‌పాత్‌లు ప్రమాదకరంగా మారాయని, వీధుల్లో చెత్త పేరుకుపోయిందని, పైపులైన్లు పగిలిపోయాయని ఆమె పేరోన్నారు. 
 
ఈ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం పనులకు వెళ్లలేక ఆదాయం కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని తన ప్రచార వీడియోలో భారత సంతతి మహిళ పేర్కొన్నారు. “నేను రాజకీయ నేతను కాదు. నాకు ఎలాంటి ప్రత్యేక బృందాల మద్దతు లేదు. ప్రభుత్వ సేవలను మెరుగుపరచడమే నా కర్తవ్యం” అని ఆమె అన్నాస్పష్టం చేశారు.

రిని సంపత్ తమిళనాడులోని తేనిలో జన్మించారు. ఆమెకు ఏడేళ్ల వయసున్నప్పుడు కుటుంబంతో అమెరికాకు వలస వెళ్లింది. తన తాతయ్య స్ఫూర్తితో ప్రజాసేవలోకి వచ్చినట్టు ఆమె తెలిపారు. తమ కుటుంబ విషయంలో తన తండ్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం తనకు ఎంతో ప్రేరణన ఇచ్చిందని ఆమె వివరించారు. రాజకీయాల్లో రావడానికి తన కుటుంబ నేపథ్యమే స్ఫూర్తి అని రిని స్పష్టం చేశారు.

‘‘మా తాతయ్యే నాకు స్ఫూర్తి. ఆయన ఏడో తరగతి, మా అమ్మమ్మ ఒకటో తరగతి మాత్రమే పూర్తిచేశారు. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను వాషింగ్టన్‌లో జీవించడం, ఇటువంటి గొప్ప జీవితాన్ని అనుభవించడం నాకు చాలా గర్వకారణం” అని ఆమె తెలిపారు. 

 
కుటుంబానికి మెరుగైన జీవితం అందించాలనే తపనతో మమ్మల్ని అమెరికాకు తీసుకురావడానికి తన తండ్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, ఆయనే తనకు ఆదర్శమని రిని చెప్పారు. తన మాతృభాష తమిళం అని రిని తెలిపారు. ఇక, తన ఎన్నికల ప్రచారానికి 15,000 డాలర్లకుపైగా సమీకరించినట్టు పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో డెమొక్రాట్లకు ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రైమరీలో గెలుపే మేయర్ పీఠానికి కీలకం కానుంది.