భారతీయ రెస్టారెంట్లు దాదాపు రూ.70,000 కోట్ల పన్నులు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల హైదరాబాద్లోని రెస్టారెంట్లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు చేసిన సమయంలో కొన్ని రెస్టారెంట్లలో బిల్లులు తక్కువగా చూసి, పన్నులు ఎగవేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాల్ని పరిశీలిస్తూ వెళ్లగా భారీ స్కాం బయటపడింది. హైదరాబాద్ రెస్టారెంట్ల నుంచి మొదలైన తనిఖీ జాతీయ స్థాయి వరకు వెళ్లింది. రెస్టారెంట్లు తమ బిల్లింగ్ కోసం దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు.
అయితే, దీనిలోని లోపాల్ని ఆధారం చేసుకుని, సాఫ్ట్వేర్ దుర్వినియోగం చేస్తూ బిల్లుల్ని తక్కువగా చూపుతున్నారు. యూపీఐ, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి వాటి ద్వారా చేసే చెల్లింపుల్ని మాత్రమే లెక్కల్లో చూపుతున్నారు. కానీ, నగదు ద్వారా జరిగే బిల్లుల్ని తొలగించివేస్తున్నారు. దీంతో ఆ రెస్టారెంట్లలో తక్కువ వ్యాపారం జరిగినట్లు చూపించి, ప్రభుత్వానికి పన్నులు కూడా తక్కువగానే కడుతున్నారు. కొన్నిసార్లు అసలు బిల్లులే రాలేదని కూడా చూపుతున్నారు.
దేశంలోని 1.77 లక్షల రెస్టారెంట్లకు సంబంధించిన బిల్లుల సాఫ్ట్వేర్ను పరిశీలించి అధికారులు ఈ విషయం చెబుతున్నారు. దొంగ బిల్లులకు కారణమైన సాఫ్ట్వేర్ను 10 శాతం కంపెనీలు వాడుతున్నాయి. వీటికి సంబంధించి 60 టీబీ డాటాను అధునాతన టెక్నాలజీ, ఏఐ ద్వారా పరిశీలించగా ఈ విషయం బయటపడింది. మొత్తంగా రెస్టారెంట్లు తమ బిల్లుల్లో 27 శాతం వరకు లెక్క చూపడం లేదు. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు 2019-20 నుంచి 2025-26 వరకు రూ.70,000 కోట్ల పన్నుల్ని ఎగవేశాయి.
ఏపీ, తెలంగాణలోని రెస్టారెంట్లు ఐదేళ్ల కాలంలో రూ.5,141 కోట్లు ఎగవేశాయి. అందులో 40 రెస్టారెంట్లు కలిపి రూ.400 కోట్లు ఎగవేశాయి. ఇక అత్యధిక బిల్లులు ఎగ్గొట్టిన రాష్ట్రాల్లో కర్ణాటక రూ.2,000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ.1,500 కోట్లతో తెలంగాణ రెండో స్థానంలో, రూ.1,200 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. బిల్లుల్లో మోసాలకు పాల్పడి పన్నులు ఎగ్గొట్టిన రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు అంటున్నారు. ఇంకా ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది.

More Stories
ఉచిత పథకాల వల్ల రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం
అమెరికా-భారత్ మధ్య ‘సముద్ర కేబుల్ మార్గం’
100 బిలియన్ డాలర్లతో అదానీ డేటా సెంటర్ల ఏర్పాటు