భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ వీసా ప్రక్రియ సులభతరం

భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ వీసా ప్రక్రియ సులభతరం
భారతీయ విద్యార్థుల కోసం వీసా, అడ్మిషన్ ప్రక్రియను సరళీకరిస్తామని, అలాగే ఫ్రాన్స్‌లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సులను పెంచుతామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించారు. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను ఏడాదికి 30,000కు పెంచడమే లక్ష్యంగా ప్రధాని మోదీతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 
 
భారతదేశ పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి విద్య, శాస్త్రీయ సమావేశంలో మేక్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) క్యాంపస్‌లో ఆయన ప్రసంగిస్తూ, భారత్-ఫ్రాన్స్ విద్యా సంబంధాలను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
 
“రానున్న రోజుల్లో మా దేశానికి ఎక్కువ మంది భారతీయ విద్యార్థులను స్వాగతించాలనుకుంటున్నాం. అదేవిధంగా, అలాగే ఫ్రెంచ్ విద్యార్థులు కూడా భారత్‌కు రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి భారత్ నుంచి ఫ్రాన్స్ వచ్చే విద్యార్థుల సంఖ్య 10వేలుగా ఉంది. ఆ సంఖ్యను 2030 నాటికి 30,000లకు పెంచాలని ప్రధాని మోదీతో చర్చించా” అని తెలిపారు. 
 
ఫ్రాన్స్ వైపు నుంచి తాము అడ్మిషన్ల ప్రక్రియను, వీసా విధానాన్ని సరళీకరిస్తామని, విద్యార్థుల అంచనాలకు అనుగుణంగా ఈ ప్రక్రియలను మరింత ఆచరణాత్మకంగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేక్రాన్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి, ‘ఇండో-ఫ్రెంచ్ క్యాంపస్ ఆన్ ఏఐ ఇన్ గ్లోబల్ హెల్త్’ను ప్రారంభించారు. 
 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచడానికి ఇది ఒక కీలక అడుగు అని అన్నారు. పరిశోధన, ఆవిష్కరణ, సామర్థ్య నిర్మాణం వంటి అంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంచడం దీని లక్ష్యమని పేర్కొన్నారు.  మరోవైపు, ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు ప్రపంచ స్థాయి బోధన, ప్రముఖ పరిశోధనా కేంద్రాల్లో పని చేసే అవకాశాలు లభిస్తాయని మెక్రాన్ చెప్పుకొచ్చారు.
ఆంగ్ల మాధ్యమంలో విభిన్న కోర్సులు అందుబాటులో ఉంచడం ద్వారా భారత విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పిస్తామని వెల్లడించారు. “మా వద్ద ఉత్తమ బోధన సదుపాయాలు ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆంగ్లంలో కూడా విభిన్న కోర్సులు అందిస్తాం. ఉన్నత విద్యలో వారికి అవసరమైన అన్ని విధాల సహాయ, సహకారాలను అందిస్తాం” అని మెక్రాన్ హామీ ఇచ్చారు.