శివుడికి దైవప్రసాదం పేరుతో మాదకద్రవ్యాలంటూ రీల్స్

శివుడికి దైవప్రసాదం పేరుతో మాదకద్రవ్యాలంటూ రీల్స్

* ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న చార్మినార్ టాస్క్​ఫోర్స్ పోలీసులు

మహా శివరాత్రి రోజున దేవుడికి మాదకద్రవ్యాలు చూపిస్తూ కొందరు యువకులు రీల్స్‌ చేయడంపై హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీపీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సామాజిక మాధ్యమం ఎక్స్​లో హెచ్చరించారు.  ఈ వ్యవహారంపై వెంటనే స్పందించిన చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఫలక్‌నుమా ప్రాంతంలోని జంగమ్‌మెట్‌కు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

శివరాత్రి రోజున శివుడికి దైవప్రసాదం పేరుతో కొందరు యువకులు మాదక ద్రవ్యాలు చూపించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా అయ్యింది. అది కాస్తా సీపీ సజ్జనార్​ దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆ వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దేవుడి ముందు మాదకద్రవ్యాలు చూపిస్తూ రీల్సా? అంటూ మండిపడ్డారు. 

 
ప్రచారం కావడం కోసం ఎంతకైనా తెగిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడికి మాదకద్రవ్యాలు చూపించడం అత్యంత హేయమైన చర్య అని, ఒకరకంగా వికృతమైన ఉన్మాదమని మండిపడ్డారు. “మహాశివరాత్రి భక్తికి నిదర్శనం, ముక్తికి సోపానం. పరమ పవిత్రమైన ఈ పర్వదినాన, దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య. అది వికృతమైన ఉన్మాదం!” అంటూ చివాట్లు పెట్టారు.
 
“మేమేదో సాహసం చేశామని అనుకుంటున్నారా!? అస్సలు కాదు. ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం! ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగిస్తే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. లైకుల కోసం, లోకాన్నే మరిచి, వ్యూస్ కోసం – విలువలనే వదిలి, రీల్స్ కోసం రోడ్డున పడి, మత్తులో మునిగి జీవితాలను నాశనం చేసుకుంటారా!? చెప్పండి” అంటూ హెచ్చరించారు. 
 
“క్షణికానందం ఇచ్చే లైకులు, వ్యూస్ కోసం మీ బంగారు భవిష్యత్తును బలిపెట్టకండి. ఇటువంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించం. బాధ్యులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాను మీ సృజనాత్మకతకు వేదికగా మార్చుకోండి వ్యసనాలకు వాకిలిగా కాదు” అంటూ హితవు చెప్పారు.   సీపీ పోస్టు వ్యవహారంపై తక్షణమే స్పందించిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలక్‌నుమా జంగమ్‌మెట్‌కు చెందిన సభావత్ శ్రీ చరణ్, వర్తేవత్ విజయ్ కృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.