హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మ ఇవ్వాలి

హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మ ఇవ్వాలి
హిందూ జనాభా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హిందూ కుటుంబాలు ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆలోచించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) సర్ సంఘచాలక్​ మోహన్ భాగవత్ సూచించారు. మంగళవారం ఉత్తర్​ప్రదేశ్ లఖ్​నవూలోని సరస్వతి శిశు మందిర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ  సగటున ముగ్గురు కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న సమాజం భవిష్యత్తులో నాశనం కానుందని శాస్త్రవేత్తలు చెప్పినట్లు గుర్తు చేశారు.
నూతన దంపతులకు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలని చెబుతూ వివాహం ఉద్దేశ్యం కేవలం ఒకరి స్వంత కోరికలను తీర్చుకోవడం మాత్రమే కాదని, సృష్టిని ముందుకు తీసుకెళ్లడమేనని ఆయన తెలిపారు. హిందూ సమాజం ఏకం కావాల్సిన అవస ఏర్పడింరందని చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మతమార్పిళ్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని తెలిపారు. సామరస్యం లేకపోవడం వల్లే వివక్షకు కారణం అవతుందని పేర్కొంటూ పౌరులందరూ ఒకే దేశం- ఒకే జన్మభూమి అనే భావన కలిగి ఉండాలని చెప్పారు.

“మనమందరం ఒకే దేశం, ఒకే మాతృభూమి బిడ్డలం. మనుషులుగా, మనమందరం ఒకటే. ఒకప్పుడు వివక్ష ఉండేది కాదు. కానీ కాలక్రమేణా వివక్ష అనేది ఒక అలవాటుగా మారింది దానిని నిర్మూలించాలి. సనాతన ధర్మం సామరస్యంతో సిద్ధాంతం. మనల్ని వ్యతిరేకించే వారిని నిర్మూలించాలని మనం భావించము. ప్రతిచోటా ఒకే సత్యం ఉంది. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని ఆచరించడం వివక్షను తొలగిస్తుంది” అని తెలిపారు. 

“మాతృశక్తి” (స్త్రీ శక్తి) అనేది గృహానికి పునాది అని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్  అభివర్ణించారు. స్త్రీలను బలహీనులుగా చూడకూడదని చెబుతూ భారతీయ సంప్రదాయం మహిళలకు గౌరవనీయమైన స్థానాన్ని ఇస్తుందని,  శారీరక రూపాన్ని కంటే లక్షణాలను పెంపొందించడాన్ని విలువైనదిగా భావిస్తుందని ఆయన చెప్పారు. 

మహిళ  పెళ్లి తర్వాత మరొక ఇంటికి వెళ్లి అక్కడ ప్రతీ ఒక్కరిని సొంతవారిలా చేసుకుంటుంది. వారంతా యోధురాళ్లు. మహిళలు సహజంగానే శక్తిమంతులు. వారికి స్వీయ రక్షణ విద్య నేర్పించాలి. పాశ్చాత్య సంస్కృతిలో మహిళలను భార్యలుగా పరిగణిస్తారు. కానీ మనం మాత్రం మహిళలను తల్లులుగా భావిస్తాం. ఇక్కడ వారి అందం కంటే అప్యాయతకే గౌరవం ఉంటుంది” అని చెప్పారు.

దేశంలోకి చొరబడే ఆక్రమణదారులను గుర్తించి, తిరిగి పంపించాలని మోహన్ భాగవత్​​  చెప్పారు. ముఖ్యంగా వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. వివాహం ఉద్దేశం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికని, కోరికలను తీర్చుకోవడం కోసం కాదని భగవత్ పేర్కొన్నారు.  ఎలాంటి వివక్ష లేకుండా ఆలయాలు, బావులు, శ్మశాన వాటికలకు హిందువలందరికీ అనుమతి ఉండాలని ఆయన చెప్పారు.

పిల్లలకు చిన్ననాటి నుంచే కేవలం సంపాదించడమే కాకుండా, ఇతరులకు సాయం చేయాలనే విధానాన్ని భోదించాలని సూచించారు. అన్నింటికన్నా దేశం, దేశ ప్రయోజనాలే ముఖ్యమనే భావనను కల్పించాలని తెలిపారు. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్​ తీసుకువచ్చిన మార్గదర్శకాలపైనా మోహన్ భాగవత్ స్పందించారు. చట్టాన్ని అందరూ తప్పకుండా పాటించాలని, ఒకవేళ తప్పుగా ఉంటే సవరించేందుక రాజ్యాంగ బద్ధంగా మార్గాలు ఉన్నాయని గుర్తు చేశారు.

“ఒకవేళ చట్టం తప్పుగా ఉంటే దానిని సవరించే మార్గం కూడా ఉంటుంది. ఘర్షణలకు కులాలు కారణం కాకూడదు. మనమంతా ఒక సమాజానికి చెందిన వారిమనే భావన ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఎవరైతే కింద పడిపోయి ఉంటే వారిని మనమే కిందకు వంగి పైకి లేపాలి. ఇలాంటి ఆలోచన ప్రతీ ఒక్కరిలోనూ ఉండాలి” అని భగవత్ హితవు చెప్పారు.

ప్రపంచమంతా సమన్వయంతోనే ముందుకుపోతుందని, వివాదాలతో కాదని స్పష్టం చేశారు. ఒకరిని తొక్కి మరొకరు పైకి ఎదగాలనే భావన ఉండకూడదని ఆయన తెలిపారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్ మార్గదర్శిగా నిలుస్తుందని ​ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అనేక సమస్యలకు భారత్​ వద్ద పరిష్కారాలు ఉన్నాయని చెప్పారు. మనం కలిసి మాట్లాడుకుంటే ఇద్దరి మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలగిపోతాయని తెలిపారు. 

ఇలా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని, బలహీనులకు సాయం చేయాలని తెలిపారు. అమెరికా, చైనా లాంటి దేశాల్లోని కొందరు మన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించారు. మనమందరి వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.