“వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భారత్- ఫ్రాన్స్ సంబంధాలు

“వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భారత్- ఫ్రాన్స్ సంబంధాలు

* ఇకపై భారత్​లోనే ‘హామర్​ క్షిపణుల తయారీ’!

భారతదేశం, ఫ్రాన్స్ మంగళవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం”గా పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఆవిష్కరణ, సాంకేతికత, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడిలో వివిధ సహకార చర్యలను ప్రకటించాయి.  ముంబైలో ఒక సంయుక్త పత్రికా ప్రకటనను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని, పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితి మధ్య “ప్రపంచ స్థిరత్వం, ప్రపంచ పురోగతి”కి శక్తిగా పనిచేస్తుందని తెలిపారు.

ఈ పర్యటన కొత్త సంస్థాగత సహకారాలు, ఆర్థిక ఒప్పందాలను వివరించే ఫలితాల అధికారిక జాబితాను కూడా రూపొందించింది. స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యార్థులు, పరిశోధకుల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి, ఈ సంబంధాన్ని ప్రధానమంత్రి “ప్రజల భాగస్వామ్యం”గా మార్చడానికి రెండు దేశాలు భారతదేశం-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ 2026ను ప్రారంభించాయి. 
 
ఈ చొరవలో భాగంగా, బయోటెక్నాలజీ, కీలకమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలలో సహకారాన్ని విస్తరించడంతో పాటు ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్, ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్‌ను స్థాపించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.  ఇరు దేశాలు తమ 10 ఏళ్ల రక్షణ సహకార ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు, అత్యాధునిక ‘హామర్’ క్షిపణులను భారత్‌లోనే తయారు చేసేందుకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి.
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ వౌట్రిన్ మధ్య జరిగిన ‘6వ భారత్-ఫ్రాన్స్ వార్షిక రక్షణ చర్చల’ సందర్భంగా ఈ ఒప్పందాలు జరిగాయి. భారత్ తరపున రక్షణ కార్యదర్శి, ఫ్రాన్స్ తరపున అంతర్జాతీయ సంబంధాలు, వ్యూహాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఈ 10 ఏళ్ల రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్​), ఫ్రాన్స్‌కు చెందిన సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ మధ్య హామర్ క్షిపణుల తయారీకి సంబంధించి జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరింది. 

దీనివల్ల ఈ శక్తివంతమైన క్షిపణులు ఇకపై భారత్‌లోనే తయారుకానున్నాయి. అంతేకాదు భారత సైన్యం, ఫ్రాన్స్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థల్లో ఇరు దేశాల అధికారులు పరస్పరం విధులు నిర్వహించేలా (రిసిప్రొకాల్ డిప్లాయ్​మెంట్​) ఓ అవగాహనకు వచ్చారు. భారత్​తో కుదిరిన రక్షణ సంబంధాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ ముంబయిలో జరిగిన ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్’లో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా’లో ఫ్రాన్స్ ఒక కీలక భాగస్వామి అని స్పష్టం చేశారు.

ఆవిష్కరణ అంటే కేవలం సాంకేతిక రంగంలో సాధించే విజయాలు మాత్రమే కాదని మేక్రాన్ చెప్పుకొచ్చారు. అవి సామాన్య ప్రజల ప్రయోజనం కోసం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసమని తెలిపారు.  ప్రజల జీవితాలను మరింత ఆరోగ్యకరంగా, సురక్షితంగా మార్చడం కోసం అనే ఉమ్మడి ఆకాంక్షతోనే ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు.

రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఐదవ తరం విమానాల ఇంజన్లు ఇలా అనేక రంగాలలో ఫ్రాన్స భారత్‌తో కలిసి పని చేస్తోందని చెబుతూ ఈ రంగంలో సాంకేతిక బదిలీని తాము కూడా విశ్వసిస్తామని పేర్కొన్నారు.  అలాగే ప్రయివేటు రంగంలో తొలిసారిగా నెలకొల్పిన కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్‌ అసెంబ్లీ లైన్‌ను రెండు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు.

వీటితో పాటు ఇండో-ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ ఎఐ ఇన్‌ హెల్త్‌, ఇండో-ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ డిజిటల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ ఇన్‌ ఏరోనాటిక్స్‌ వంటి సంస్థలను కూడా ఇరువురు నేతలు ప్రారంభించారు.  ‘ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించే వేదికలు’ అని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. 

ఆధిపత్యం లేని ప్రపంచం, చట్టబద్ధ పాలన కోసం ఉమ్మడి విలువల ప్రాతిపదికగా ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం చాలా ప్రత్యేకమైన స్వభావం కలిగియున్నదని మాక్రాన్‌ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొత్త మార్గాన్ని అనుసరిద్దామని ఆయన పేర్కొన్నారు. కలిసికట్టుగా నడుద్దామని, ప్రపంచానికి కలిసి పనిచేయడం ఎలాగో ఒక నమూనగా నిలుద్దామని తెలిపారు. పరస్పరం గౌరవించుకోవాలని, అలాగే వైవిధ్యాన్ని గౌరవించాలని, గణాంకాల విషయాల్లో పారదర్శకంగా నిలువాలని ఆయన పిలుపిచ్చారు.