తెలంగాణాలో 15 మునిసిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ

తెలంగాణాలో 15 మునిసిపాలిటీల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ
 
* కరీంనగర్ మేయర్, నారాయణపేట, భైంసా మునిసిపల్ చైర్మన్ పదవుల కైవసం
 
తెలంగాణ బిజెపి 15కి పైగా మునిసిపాలిటీలలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని, కనీసం 25 మునిసిపాలిటీలలో నిర్ణయాత్మక శక్తిగా నిలిచిందని  రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఒక మునిసిపల్ కార్పొరేషన్ (కరీంనగర్) మేయర్ పదవిని సొంతబలంపై పొందిందని చెప్పారు. గతంలో వరంగల్ మేయర్ పదవి పొందినా టిడిపి మద్దతుతో పొందిందని తెలిపారు. 
 
కాగా, రెండు మున్సిపల్ చైర్మన్ పదవులను పొందామని వివరించారు. నారాయణపేటను తిరిగి గెలుచుకోగా,  భైంసాలో మొదటిసారి చైర్మన్ పదవి పొందామని చెప్పారు.   “మేము ఊహించిన దానికంటే తక్కువ మునిసిపాలిటీలను గెలుచుకున్నప్పటికీ, పార్టీకి మొత్తం ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది” అని రావు నొక్కిచెప్పారు. 2020లో బిజెపికి 204 సీట్లు ఉన్నాయని, ఇది పట్టణ స్థానిక ఎన్నికలలో 336 సీట్లకు పెరిగిందని అన్నారు. 
 
అంతేకాకుండా, 28 కార్పొరేటర్లను గెలుచుకోవడం ద్వారా నిజామాబాద్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు.  బిఆర్ఎస్ 14 శాతం ఓట్ల తగ్గుదలతో ఇప్పుడు 13 మునిసిపాలిటీలకు మాత్రమే పరిమితం అయిందని ఆయన తెలిపారు. బిజెపి మేయర్, చైర్‌పర్సన్ పదవులను గెలుచుకోకుండా నిరోధించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బిఆర్‌ఎస్, కమ్యూనిస్టులు కలిసి కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు.
 
స్థానికంగా ఎటువంటి ఉనికి లేకపోయినా, తెలంగాణలో “రెడ్ ఫ్లాగ్” (కమ్యూనిస్టులు) అధికారం పొందడానికి కాంగ్రెస్ సహాయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సున్నితమైన భైంసాలో పార్టీ ఖాతా తెరవడం పార్టీ సాధించిన ముఖ్యమైన విజయాలలో ఒకటని చెబుతూ, ఇక్కడ కాంగ్రెస్-మజ్లిస్, బిఆర్‌ఎస్-మజ్లిస్ వంటి ప్రతిపక్ష పార్టీలు బిజెపిని భైంసాలోకి ప్రవేశించకుండా చాలా కాలంగా అడ్డుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
 
గతంతో పోలిస్తే బిజెపి ఓట్లు, సీట్లు పెరిగాయని, ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, పరకాల వంటి ప్రదేశాలలో పార్టీ మొదటిసారి సీట్లు గెల్చుకుందని తెలిపారు. కాగా తెలంగాణాలో ఎంఐఎం పార్టీ ప్రభావం పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ, మజ్లిస్ పార్టీ ఓట్ల శాతం తగ్గినప్పటికీ, రాష్ట్రంలో దాని ప్రభావం పెరుగుతోందని రావు ఆందోళన వ్యక్తం చేశారు.
 
రాష్ట్రంలో పలు మున్సిపల్ ప్రాంతాలలో ముస్లింల జనాభా అనూహ్యంగా, 20 నుండి 57 శాతం వరకు పెరగడంతో ఎంఐఎం ఉనికి విస్తరిస్తోందని ఆయన తెలిపారు. నిర్మల్‌లోని ఒక వార్డులో, మైనారిటీ ఓట్లు అసహజంగా 20 శాతం నుండి 57 శాతానికి పెరిగాయని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని చెబుతూ “నకిలీ ఓట్లు”, “బయటి ఓట్లను” తొలగించాల్సిందే అని స్పష్టం చేశారు.