ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన అముద్రిత జ్ఙాపకాల పుస్తకం ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ చేసిన సాయుధ దళాల సిబ్బంది పుస్తకాలు రాయడం, ప్రచురించడంపై 20 సంవత్సరాల నియంత్రణతో(కూలింగ్ ఆఫ్ పీరియడ్) సహా కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పుస్తకాలను ప్రచురించే ముందు ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న, ఉద్యోగ విరమణ చేసిన సైనికాధికారులకు సంబంధించిన విధానాలను స్పష్టంగా నిర్వచించే సమగ్ర నిబంధనలను రక్షణ శాఖ విడిగా రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనలను రూపొందించడానికి ఇటీవల ఓ సమావేశం జరిగిందని, ఇందులో సమగ్రంగా వాటి గురించి వివరించడం జరిగిందని ఓ రక్షణ శాఖ సీనియర్ అధికారి ఓ ఆంగ్ల దినపత్రికకు తెలిపారు.
ప్రస్తుత సర్వీస్ నిబంధనలతోపాటు అధికారిక రహస్యాల చట్టం(ఓఎస్‌ఏ) నుంచి నిబంధనలను కూడా ఆ కొత్త నిబంధనలలో పొందుపరచనున్నారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన సైనికాధికారుల పుస్తక రచనను ఏ ఒక్క ఏకీకృత చట్టం నియంత్రించడం లేదు. అయితే ఉద్యోగంలో ఉన్న సైనికాధికారులు రచన చేపట్టే ముందు రాతపూర్వక అనుమతిని పొందాల్సి ఉంటుంది.
కాని ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన వారు కూడా చట్టపరమైన నిబంధనల పరిధిలో పని చేయాలి. చట్టాలు, ముఖ్యంగా ఓఎస్‌ఏ జీవితాంతం సైనికాధికారులకు వర్తిస్తాయి. అధికారిక సమాచారం, సున్నితమైన కార్యాచరణ వివరాలు, నిఘా సమాచారం లేదా జాతీయ భద్రతకు హాని కలిగించే విషయాలను బహిర్గతం చేయడాన్ని ఓఎస్‌ఏ క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది.
ఒక రాతప్రతిలో సైనిక కార్యాచరణకు సంబంధించిన వివరాలు లేదా సున్నితమైన కంటెంట్ ఉంటే రచయితలు దానిని పరిశీలన కోసం రక్షణ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత శాఖ ఆమోదం మంజూరు చేసే ముందు విషయాన్ని పరిశీలించి తమ అభిప్రాయాలను నమోదు చేస్తుంది. ఉద్యోగలో ఉన్న సిబ్బందికి నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి.
కాగా, సర్వీసు నిబంధనల ప్రకారం పుస్తకాలను, వ్యాసాలను ప్రచురించడానికి లేదా రాజకీయ లేదా ప్రయోజనకర కార్యకలాపాలలో పాల్గొనడానికి ముందస్తు లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. కల్పిత రచనలు కూడా నిజమైన సైనిక కార్యకలాపాలను పోలి ఉంటే పరిశీలనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిపాదిత మార్గదర్శకాలు ఉద్యోగ విరమణ చేసిన సైనిక సిబ్బందికి కూడా వర్తించేలా ఉంటాయని అంచనా.
అయితే కొత్త మార్గదర్శకాలకు సంబంధించిన ప్రతిపాదన ఏదీ తన దృష్టికి రాలేదని రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. కొత్త మార్గదర్శకాలను పరిశీలిస్తున్న విషయం తనకు తెలియదని, ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు, ఓఎస్‌ఏ సర్వీసులో ఉన్న, రిటైర్డ్ అయిన సైనిక సిబ్బందికి వర్తిస్తుందని ఓ వార్తాసంస్థకు ఆయన తెలిపారు.

More Stories
నిష్క్రమణ ప్రసంగంలో యూనస్ భారత్ ను రెచ్చగొట్టే వాఖ్యలు
రైతుల కోసం ఏఐ ఆధారిత భారత్-విస్తార్ నేడే ప్రారంభం
ఏఐ సాయంతో సర్వజన సంక్షేమానికి పరిష్కారాలు