ముస్లింలకు వ్యతిరేకంగా వీడియోను పోస్టు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నే రాజా, డాక్టర్ హీరన్ గోహెయిన్ ఆ పిటీషన్లు వేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, విపుల్ పాంచోలీతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది.
సీఎం బిశ్వ శర్మపై ఉన్న ఆరోపణల కేసుల్లో గుహతి హైకోర్టును ఆశ్రయించడం మంచిదని సుప్రీంకోర్టు చెప్పింది. సీఎం బిశ్వశర్మపై దాఖలైన కేసులను సుప్రీం విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, ఇది హైకోర్టు పరిధిలోనే జరగాలని, ఈ పిటీషన్లను త్వరితగతిన విచారణ కు చేపట్టాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కోరుతున్నామని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది.
ఈ కేసుల్లో మీరు హైకోర్టుకు వెళ్లలేదని, మరొక కోర్టు పరిధిని తాము తక్కువగా చూడలేమని, అన్నింటికీ సుప్రీంకోర్టు మైదానం కాలేదని, ఇలాంటి కేసుల్లో హైకోర్టు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని సీజేఐ కాంత్ తెలిపారు. బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని గతంలోనే గుహతి హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారని సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ తెలిపారు.
కేవలం అస్సాంలోనే కాదు, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ విద్వేష వ్యాఖ్యలు చేసినట్లు బిశ్వశర్మపై ఆరోపణలు చేశారు. బిశ్వశర్మ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని, ఆయన వ్యాఖ్యలు యావత్ దేశానికి వర్తిస్తాయని, తప్పులు చేయడం ఆయనకు అలవాటు అయినట్లు సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ పేర్కొన్నారు.
ఏదేమైనా ఈ కేసులో తొలుత హైకోర్టులో వాదనలు జరగాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నాలుగైదు లక్షల మంది మియా ఓటర్లను జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుందని గతంలో బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ శాఖ ఓ వివాదాస్పద వీడియోను పోస్టు చేసింది. బిశ్వశర్మ తన రైఫిల్‌తో ముస్లింలను టార్గెట్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉన్నది. దీంతో బిశ్వశర్మపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వీడియోను తర్వాత తొలగించారు.

More Stories
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం సమీక్ష
ఏఐపై చర్చకు ప్రపంచాన్ని ఒకే వేదికపై తీసుకువస్తున్నాం
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’