`బలమైన స్థానం’ నుంచే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం

`బలమైన స్థానం’ నుంచే వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం
అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు), న్యూజిలాండ్‌లతో ఇటీవల జరిగిన వాణిజ్య ఒప్పందాలపై తన ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన తయారీ రంగం, ఎంఎస్‌ఎంఇలు (సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ) కారణంగా భారతదేశం “బలమైన స్థానం’ నుంచేవాణిజ్య ఒప్పందాలు చేసుకుందని స్పష్టం చేశారు.
 
యుపిఎ ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కూటమి భారతదేశాన్ని విశ్వాస స్థానం నుండి చర్చలు జరపలేకపోయిందని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధ్వజమెత్తారు.  భారత్ ఇప్పటికే 38 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ)ను కుదుర్చుకుందని ప్రధాని గుర్తు చేశారు.  వస్త్ర, లెదర్, రసాయన, హస్తకళలు, రత్నాలు, ఇతర రంగాల్లోని భారతదేశ ఎంఎస్‌ఎంఈలకు విదేశీ మార్కెట్లను తెరిచేందుకు ఈ ఒప్పందాలు దోహదపడతాయని తెలిపారు.
గత కొన్నేళ్ల వ్యవధిలో మునుపటి రికార్డులను అధిగమించే రేంజులో విదేశాలకు భారత్ వస్తు, ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయని ప్రధాని గుర్తు చేశారు.  భారత్‌లో ప్రస్తుతం రాజకీయ సుస్థిరత ఉందని, దేశ రాజకీయ భవితవ్యంపైనా విదేశీ పెట్టుబడిదారులు ఇప్పుడు సులభంగా స్పష్టమైన అంచనాకు రావొచ్చని చెబుతూ అందుకే వారికి భారత మార్కెట్‌పై విశ్వాసం పెరుగుతోందని ప్రధాని చెప్పారు. ఈసారి పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అనేది వికసిత దేశంగా ఎదగాలనే భారత్ ఆరాటానికి ప్రతీక అని ప్రధాని మోదీ తెలిపారు. 
 
ఇప్పుడు కాకుంటే, ఎప్పుడూ కాదు అనే బలవంతపు భావన నుంచి ఈ కేంద్ర బడ్జెట్ రాలేదని, సన్నద్ధత, స్ఫూర్తిలతో ఏర్పడిన `మేం సిద్ధం’ అనే భావన నుంచి ఇది వచ్చిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దేశ రక్షణ రంగాన్ని ఆధునికీకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం భుజస్కంధాలపై ఉందని ఆయన తెలిపారు.  అందుకోసమే రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను పెంచామని పేర్కొన్నారు. దేశ త్రివిధ దళాల బలోపేతం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని మోదీ వెల్లడించారు.

‘‘భారతదేశ తదుపరి దశ ఆర్థిక పరివర్తనలో ప్రైవేటు రంగం అత్యంత కీలకమైన పాత్రను పోషించాల్సి ఉంటుంది. ఆ రంగం నుంచి నిర్ణయాత్మక స్పందన వస్తుందని నేను ఆశిస్తున్నాను. వికసిత భారత్ దిశగా మన దేశం పయనించాలంటే ప్రైవేటు రంగం ఆవిష్కరణలు, దీర్ఘకాలిక సామర్థ్యం పెంపు, అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ వంటి విభాగాల్లో ధైర్యంగా పెట్టుబడులను పెట్టాలి” అని ప్రధాని స్పష్టం చేశారు. 

ప్రైవేటు రంగం లాభాలను కాపాడుకోవడంపై తక్కువగా, పరిశోధన – అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), సప్లై చైన్, నాణ్యతలపై ఎక్కువగా దృష్టి సారించాలని తెలిపారు. పారిశ్రామిక ఉత్పాదకత పెరిగితే, ప్రైవేటు కంపెనీల యజమానులు ఆ ఫలాలను పారదర్శకంగా కార్మికులతో పంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

‘‘వికసిత భారత్ సాధనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు అనేది నా బలమైన నమ్మకం. అందుకే మహిళా సంక్షేమం విషయంలో మా ప్రభుత్వం ఎలాంటి రాజీకి తావు ఇవ్వడం లేదు. మా సర్కారు ప్రతీ నిర్ణయంలోనూ మహిళా సంక్షేమ భావన ఉండేలా చూస్తున్నాం. భారత సైనికుల సంక్షేమం అంశానికీ మేం పెద్దపీట వేస్తున్నాం. భారత్ బలంగా, సర్వసన్నద్ధంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని ప్రధాని తెలిపారు. 

ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అన్ని కేంద్ర బడ్జెట్‌లు దేనికవి ప్రత్యేకమైనవని పేర్కొంటూ  బడ్జెట్ రూపకల్పన కోసం తాను అనుసరించే ప్రమాణాలు అలాంటివని చెప్పారు. కరోనా సంక్షోభ కాలం తర్వాత భారతదేశానికి ఎన్నో రంగాల్లో అవకాశాల తలుపులు తెరుచుకున్నాయని, ప్రోత్సాహకాలు, సుంకాల ప్రాధాన్యతలు అనేవి మన దేశ అభివృద్ధి పయనానికి ఊతాన్ని ఇవ్వగలవని స్పష్టం చేశారు. 

కానీ నిలకడగా అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీని ఇచ్చే సత్తా రావాలంటే వినూత్న ఆవిష్కరణలు, విశిష్ట సామర్థ్యం, భారీ ఉత్పాదక శక్తిని మనం అందిపుచ్చుకోవాలని ప్రధాని మోదీ చెప్పారు.

“యూపీఐ వేదిక ద్వారా ప్రజల లావాదేవీలను మేం వేగవంతం చేశాం. అందుకే భారత్ ఇప్పుడు ప్రపంచంలో డిజిటల్ లీడర్‌గా మారింది. ఏఐ టెక్నాలజీకి, ఆవిష్కరణలకు దోహదం చేసే ఎకో సిస్టమ్‌కు సైతం భారత్ పునాదులు వేస్తోంది. కంప్యూటింగ్ పవర్‌ను, డేటా సెంటర్ల మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని మనం పెంచుకుంటున్నాం” అని ప్రధాని తెలిపారు. 

భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మౌలిక సదుపాయాల కల్పన రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని చెబుతూ భవిష్యత్ కోసం బంగారు భారత్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఈక్రమంలో ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం రూ.12.2 లక్షల కోట్లను కేటాయించామని, 2013 కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే ఇది ఐదురెట్లు ఎక్కువని ప్రధాని మోదీ వివరించారు.