అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో కీలక పరిణామం జరిగింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడు నిఖిల్ గుప్తా న్యూయార్క్ కోర్టులో తన నేరాన్ని ఒప్పకున్నారు. పన్నూను హత్య చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చినట్లు ఒప్పుకున్నట్లు అమెరికా అటార్నీ కార్యాలయం తెలిపారు.
అంతేకాకుండా హత్యకు ప్లాన్ చేయడంతో పాటు మనీలాండరింగ్ వంటి మూడు ఆరోపణలను అంగీకరించాడు. ఈ కేసుపై నిఖిల్ గుప్తాకు మే 29న యూఎస్ డిస్ట్రిట్ జడ్జి విక్టర్ మర్రెరో శిక్ష ఖరారు చేయనున్నారు. నిఖిల్ గుప్తాకు సుమారు 40 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అటార్నీ జే క్లేటన్ తెలిపారు.
హత్య కోసం కాంట్రాక్ట్ ఇచ్చినందుకు గరిష్ఠంగా 10 ఏళ్లు, ప్లాన్ చేసినందుకు మరో 10 ఏళ్లు, మనీలాండరింగ్ కుట్ర కింద 20 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చెప్పారు. భారత్‌కు చెందిన వికాశ్ యాదవ్, మరికొందరితో కలిసి పన్నూన్ హత్యకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నినట్లు అటార్నీ ఆరోపించారు. వికాశ్ యాదవ్ సూచనతో గుప్తా ఒక వ్యక్తిని సంప్రదించారు. అయితే సదరు వ్యక్తి అమెరికన్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) కోసం రహస్యంగా పనిచేస్తున్నట్లు అటార్నీ తెలిపారు.
పన్నూన్ హత్య కోసం ఒక కిరాయి హంతకుడిని ఏర్పాటుచేయమని గుప్తా అతడిని కోరారు. ఈ క్రమంలో లక్ష డాలర్లకు ఒప్పందం కుదిరింది. సదరు వ్యక్తి ఎఫ్‌బీఐకి సమాచారం ఇవ్వడంతో గుప్తా అరెస్టయ్యారు. 2023 నవంబరులో న్యూయార్క్‌లోని ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హతమర్చడానికి చేసిన ప్రయత్నాలను తాము భగ్నం చేసినట్లు అమెరికా ప్రకటించింది.
భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పన్నూను హత్య చేసేందుకు నిఖిల్ గుప్తా కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ క్రమంలోనే అక్కడి కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. వాటిల్లో భారత ప్రభుత్వంతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, మాజీ రా చీఫ్ సుమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్‌యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తా పేర్లు ఉన్నాయి.
ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్ దీనిపై విచారణ జరిపేందుకు 2024లోనే స్వదేశంలో ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. వికాస్ యాదవ్ ఈ అభియోగాల్లో పేర్కొన్న భారత అధికారి ప్రస్తుతం ప్రభుత్వంలో పనిచేయడం లేదని స్పష్టం చేసింది.

More Stories
తారిక్ రెహమాన్‌ను టెలిఫోన్ లో అభినందించిన ప్రధాని మోదీ
అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న బిఎన్‌పి
కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం