పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి దశ సమావేశ చివరి రోజు శుక్రవారం కూడా ఉభయ సభలూ అట్టుడికాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, కేంద్ర బడ్జెట్ పై చర్చ ఉభయ సభల్లో జరిగింది. ఈ రెండు అంశాలపై చర్చల సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. పార్లమెంటు వెలుపలా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి.
ప్రధానంగా యూరోపియన్ యూనియన్ (ఇయు)తోనూ, అమెరికాతోనూ భారత్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గుట్టు విప్పాలని, మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే పుస్తకంలోని విషయాలపై చర్చ చేపట్టాలని, అలాగే లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్ ఫైళ్లలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల పేర్లను ప్రస్తావించడంపై వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాల సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశాయి.
లోక్ సభలో ఇండిస్టియల్ రిలేషన్ కోడ్ బిల్లు ఆమోదం పొందింది. కాగా బడ్జెట్ సెషన్ రెండో విడత సమావేశాలు మార్చి 9న ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. లోక్‌సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. నినాదాలతో వెల్ లోకి దూసుకొకెళ్లారు. స్పీకర్ ఓం బిర్లాకు బదులుగా సభను నిర్వహించిన సంధ్యారే, ప్రతిపక్షాలను శాంతించమని పదేపదే కోరినా ఫలితం లేకపోయింది.
అనంతరం సభ కార్యకలాపాలను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనప్పుడు, కేంద్ర మంత్రులు తమ విభాగాలకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, రాజ్యసభ కూడా మార్చి 9 వరకు వాయిదా పడింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా తన ప్రసంగంలో ఎక్కువ భాగాన్ని రికార్డు నుండి తొలగించారని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అయితే చైర్మన్ సి.పి రాధాకృష్ణన్ దీన్ని తిరస్కరించారు. మరోవైపు ఇండియా-అమెరికా ‘ట్రాప్ డీల్’ను రద్దు చేయాలని, నేరస్థుడు ఎప్స్టీన్‌తో సంబంధాలున్నాయని బహిరంగంగా అంగీకరించిన కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు వెలుపల నిరసన తెలిపాయి.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బిజెపి సభ్యుడు దాఖలు చేసిన నోటీసుపై స్పీకర్‌ను సంప్రదించిన తరువాత చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
“మొదట హక్కుల ఉల్లంఘన కింద రాహుల్ పై నోటీసు జారీ చేయాలనుకున్నాం. ఈ సందర్భంగానే బిజెపి సభ్యుడు నిషికాంత్ దూబే రాహుల్ పై ఒక ముఖ్యమైన తీర్మాన నోటీసు ఇచ్చారు. స్పీకర్ తో సంప్రదించి ఈ విషయాన్ని హౌస్ ప్రివిలేజెస్ కమిటీకి లేదా ఎథిక్స్ కమిటీకి సూచించాలా? లేక నేరుగా లోక్ సభకు తీసుకురావాలా? వద్దా? త్వరలోనే నిర్ణయిస్తాము” అని కిరణ్ రిజిజు మీడియాకు తెలిపారు.

More Stories
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తారుమారు
ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ!
బంగ్లాదేశ్ లో జమాత్ని దెబ్బతీసిన అమెరికాతో సంబంధాలు!