ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ వేలం ముగిసి రెండు నెలలు కావొస్తోంది. మామూలుగా అయితే ఈ లోపే షెడ్యూల్ విడుదలవ్వాలి. కానీ, బీసీసీఐగానీ, ఐపీఎల్ పాలకమండలిగానీ ఐపీఎల్ షెడ్యూల్ గురించి ఒక్క ప్రకటన చేయలేదు. ఆనవాయితీ ప్రకారం మార్చి – మే నెల మధ్యలో మెగా టోర్నీ జరుగనుందని సమాచారం. కానీ, షెడ్యూల్‌పై బీసీసీఐ మౌనం దాల్చడం వెనుక కారణముందని తెలుస్తోంది.
ఎన్నికల నేపథ్యంలోనే షెడ్యూల్‌పై ప్రకటన ఆలస్యం అవుతోందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. చూస్తుంటే ఐపీఎల్‌కు కూడా అసెంబ్లీ ఎన్నికల సెగ తాకినట్టు అనిపిస్తోంది. నిరుడు డిసెంబర్ 16న అబూధాబీలో 19వ సీజన్ వేలం ముగిసింది. కానీ, ఇప్పటికీ షెడ్యూల్‌పై స్పష్టత లేదు. గత సీజన్ మాదిరిగానే మార్చిలోనే సీజన్ ఆరంభం అవుతుందని టాక్. మార్చి 26 నుంచి మే 31 వరకూ టోర్నీ నిర్వహించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ లెక్కన చూస్తే మెగా టోర్నీ ఆరంభానికి ఇంకో 45 రోజులు ఉన్నాయంతే. అయితే త్వరలోనే బెంగాల్, తమిళనాడు, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లో పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండే అవకాశముంది. అందుకే ఐపీఎల్ ఆలస్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయమై ఒకరు బీసీసీఐ అధికారులను సంప్రదించగా అవునని చెప్పారు.
“ఎన్నికల నేపథ్యంలోనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేయడం లేదు. ఒకవేళ ఎన్నికల తేదీ, కౌంటింగ్ తేదీన మ్యాచ్‌లు ఉంటే వేదికను మార్చడం పెద్ద తలనొప్పి. ఎందుకంటే పోలీసులంతా ఎన్నిక విధుల్లో నిమగ్నమవుతారు. అప్పుడు స్టేడియాల వద్ద ఆటగాళ్లకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించలేరు” అని తెలిపారు.
“కాబట్టి అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. వారి నుంచి ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చాక ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తాం” అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే రెండు విడతలుగా ఐపీఎల్ నిర్విహించడంపై ఆలోచిస్తామని ఆయన పేర్కొన్నారు. పద్దెనిమిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి)జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

More Stories
రాహుల్ సభ్యత్వం రద్దు చేయాలని బిజెపి ఎంపీ తీర్మానం
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
రెండో విడత అన్వేషణ లైసెన్స్ బ్లాకులను ప్రారంభించిన కిషన్ రెడ్డి