దేశంలోనే మొట్టమొదటి మ్యూజిక్ రహదారి ముంబయిలో ప్రారభమైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కోస్టల్ రోడ్డులో నారీమన్ పాయింట్ నుంచి వర్లీ వరకు 500 మీటర్ల మేర ప్రయోగాత్మకంగా మ్యూజిక్ రోడ్డును అభివృద్ధి చేశారు. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ఈ రహదారి ప్రాజెక్ట్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేలు కలిసి బుధవారం ప్రారంభించారు.
దీంతో మ్యూజిక్ రహదారి కలిగిన జపాన్, హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ దేశాల సరసన భారత్ చేరింది. రహదారిపై నుంచి వాహనాలు కదులుతున్నప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జై హో’ పాట లోపలి ఉన్నవారికి వినిపిస్తుంది.
ఎగుడు, దిగుడుగా ప్రత్యేకంగా రూపొందించిన రంబుల్ స్ట్రిప్‌లను ఉపయోగించి వేసిన ఈ రహదారిపై వాహనాలు గంటకు 60 నుంచి 80 కి.మీ వేగంతో ప్రయాణించినప్పుడు టైర్లు, రోడ్డు ఉపరితలం మధ్య పరస్పర చర్యతో శబ్దం ఉత్పత్తి అవుతుంది. ఈ వైబ్రేషన్స్ కారణంగా వెలువడే ధ్వని తరంగాలు ‘జై హో’ పాట ట్యూన్‌ను తిరిగి వినిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు బీఎంసీ రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది.
నారీమన్ పాయింట్ వద్ద టన్నెల్ ఎగ్జిట్ తర్వాత ప్రియదర్శిని పార్క్, అమర్‌సన్స్ గార్డెన్ మధ్యలో ఈ మ్యూజిక్ రోడ్డును ఏర్పాటు చేశారు. కాగా, ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా రోడ్లు జపాన్ 2007లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత హంగేరి, దక్షిణ కొరియా, యూఏఈలలో మ్యూజిర్ రోడ్డులను నిర్మించారు. కాగా, ముంబయి మ్యూజిక్ రోడ్డుపై ‘జై హో’ పాటను దేశానికి అంకితం చేయడంతోపాటు, ప్రజల్లో దేశభక్తి భావనను పెంపొందించే ఉద్దేశంతోనే ఉంచిన అధికారులు తెలిపారు.
హంగేరి సాంకేతికత సాయంతో సంగీత స్ట్రిప్‌ల ద్వారా పాటను వినిపించే ఏర్పాటు చేసినట్టు వారు వివరించారు. రహదారి ప్రవేశం మార్గం వద్ద సైన్‌బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ అధునాతన ఆవిష్కరణ రహదారి భద్రతను ప్రోత్సహించి, ప్రయాణికులకు ఆనందదాయకమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్ట్రెచ్‌లలో వీటిని విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

More Stories
ఎర్రకోట వద్ద పేలుడులో జైషే హస్తం.. ఐరాస
ఇకపై స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి
పిల్లల అదృశ్యం వెనుక జాతీయ స్థాయిలో నెట్వర్క్?