అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగొయ్ సహా ఇతర నేతలపై రూ. 500 కోట్లు పరువు నష్టం దావా వేశారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలు దురుద్దేశంతో కూడినవని విమర్శించారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగొయ్‌పై పరువు నష్టం దావా వేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
“మీడియా సమావేశంలో నాపై తప్పుడు, దురుద్దేశపూరిత పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకులు జితేంద్ర సింగ్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగోయ్లపై రూ. 500 కోట్ల నష్టపరిహారం కోరుతూ నేను పరువు నష్టం కేసు దాఖలు చేశాను” అని శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఫిబ్రవరి 4న గువాహటిలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించిన గొగొయ్ సహా కాంగ్రెస్ నేతలు సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ చేపట్టిన దర్యాప్తులో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4వేల ఎకరాల భూమిని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ఆక్రమించుకున్నారని వెల్లడైందని విమర్శించారు. ఈ కాంగ్రెస్ నాయకులు సంయుక్తంగా కలిసి whoishbs.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ క్రమంలోనే వెబ్సైట్లో ముఖ్యమంత్రి ఆస్తులు, భూమి ఆస్తులు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం ఉందని తెలిపారు. బహిరంగంగా అందుబాటులో ఉన్న రికార్డులు, ఎన్నికల అఫిడవిట్లు, పత్రాల ఆధారంగానే పోర్టల్‌లో పెట్టామని పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా సీఎం హిమంత బిశ్వ శర్మ ఆస్తుల ప్రకటనల్లో తీవ్రమైన అసమానతలు ఉన్నాయని ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆరోపించారు.
ఇవి పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రశ్నలను లేవనెత్తాయని విమర్శించారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి ఈ వెబ్సైట్ ప్రారంభించామని తెలిపారు.అటు కాంగ్రెస్ నేతల ఆరోపణలపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలపై చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేస్తానని ఆరోజే ప్రకటించారు.
“ఈరోజు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నాపై తప్పుడు, దురుద్దేశపూరిత, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు జితేంద్ర అల్వార్, భూపేశ్ బఘేల్, గౌరవ్ గొగొయ్లపై 2026 ఫిబ్రవరి 9న సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావా చర్యలను ప్రారంభిస్తాను. హిట్ అండ్ రన్ రాజకీయాల యుగం ముగిసింది. వారికి ధైర్యం లేదా ఆధారాలు ఉంటే ప్రతి ఆరోపణను కోర్టు ముందు నిరూపించండి. కొందరు గాంధీ కుటుంబ బానిసలు చేసే దష్ప్రచారం, రాజకీయ నాటకాలకు నేను భయపడను.” అని హిమంత బిశ్వ శర్మ ఆరోజే ట్వీట్ చేశారు.

More Stories
బాబ్రీ మసీదు పునర్నిర్మాణం ఎప్పటికీ జరగదు
అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యే వరకు సభకు ఓం బిర్లా గైరాజర్!
పార్లమెంటులో ప్రధాని మోదీ సీటు వద్ద ఏం జరిగింది?