ప్రతిపక్షాల తీరుచూసి దేశం సిగ్గుపడుతోంది

ప్రతిపక్షాల తీరుచూసి దేశం సిగ్గుపడుతోంది
ప్రతిపక్ష పార్టీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని, పార్లమెంట్‌ లో జరుగుతున్న పరిణామాలను చూసి దేశం సిగ్గుపడుతోందని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె విపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
సోమవారం లోక్‌సభలో రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను చట్టవిరుద్ధంగా ప్రస్తావించారని కంగనా ఆరోపించారు. “రాహుల్ గాంధీ నిన్న ఒక అనధికారిక, చట్టవిరుద్ధమైన పుస్తకాన్ని సభకు తీసుకొచ్చి మొత్తం న్యాయవ్యవస్థను అవమానించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ కూడా స్పష్టంచేసింది” అని కంగనా పేర్కొన్నారు. 
 
ఈ పరిణామాలతో ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు కుట్ర చేస్తున్నాయని కంగనా ఆరోపించారు. “ప్రతిపక్ష ఎంపీలు సభలో కాగితాలు చించి స్పీకర్‌పై విసరడం, టేబుళ్లపైకి ఎక్కడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి వాళ్లు ప్రధాని మోదీ చేతిలో నుంచి కాగితాలు లాక్కోరని, ఆయనపై దాడి చేయరని గ్యారెంటీ ఏంటి..?” అని ఆమె ప్రశ్నించారు.
 
ప్రధాని సభకు రావాలంటే మాకు దీనిపై హామీ కావాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలను అడ్డుపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడితే పార్లమెంట్ గౌరవం ఏమవుతుందని ఆమె ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరగనీయకుండా విపక్షాలు సభలో గందరగోళం సృష్టించడంతో లోక్‌సభ మంగళవారం కూడా వాయిదా పడింది. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేయగా, బడ్జెట్‌పై చర్చకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వారిని కోరారు.