రెండు రోజుల మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపుర్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్‌లోని రైతులకు, స్టార్టప్‌లకు, మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ భాషలకు, మలేసియా అధికారిక భాష ‘మలయ్’కు మధ్య ఉమ్మడి పదాలు చాలా ఉన్నాయని, ఇది ఇరుదేశాల మధ్య లోతైన అవగాహనకు నిదర్శనమని మోదీ గుర్తు చేశారు.
మలేసియాలోని తమిళ సమాజం శతాబ్దాలుగా అక్కడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని కొనియాడారు. భారత సంతతి కమ్యూనిటీ ఉన్న రెండో అతిపెద్ద దేశం మలేసియా అని తెలిపారు. తన ఈ పర్యటన ద్వారా ఆర్థికంగా, సాంస్కృతికంగా భారత్-మలేసియాల బంధం సరికొత్త శిఖరాలకు చేరుకోనుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
“ఇంతవరకు భారత్‌ను ప్రపంచదేశాలు ఓ పెద్దమార్కెట్లా మాత్రమే చూసేవి. కానీ ఇప్పుడు భారత్ పెట్టుబడులకు, వాణిజ్యానికి కేంద్రంలా మారింది. భారత్‌ను ఒక నమ్మకమైన భాగస్వామిగా చూస్తున్నారు. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, యూఎస్‌లు భారత్‌తో ట్రేడ్‌డీల్ కలిగి ఉన్నాయి. నమ్మకం అనేది భారత్‌కు బలమైన కరెన్సీలా మారింది” అని ప్రధాని చెప్పారు.
రాజధాని నగరం కౌలాలంపూర్‌లో ప్రధానికి ప్రవాస భారతీయులు ‘సెలామత్ దటాంగ్ మోదీజీ’ (స్వాగతం మోదీజీ) అంటూ నీరాజనాలు పలికారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు వెళ్లిన మోదీకి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఇద్దరు ప్రధానులు ఒకే కారులో ప్రయాణించి భారతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేరుకోవడం ఇరు దేశాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పింది.
మలేషియాలో భారత సంతతి, ముఖ్యంగా తమిళ ప్రజలు శతాబ్దాలుగా నివసిస్తూ ఆ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, ఎల్.మురుగన్‌లను ఆయన గుర్తుచేశారు.
మలేషియాలో త్వరలోనే కొత్త భారతీయ కాన్సులేట్‌ను ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా, గత ఏడాది భారత సంతతికి చెందిన మలేషియా పౌరులకు ‘ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా’ (ఓసీఐ) కార్డ్ అర్హతను ఆరో తరానికి విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ‘చారిత్రాత్మక నిర్ణయం’గా అభివర్ణించారు.
మలేషియాలోని భారతీయ ప్రవాసుల గొప్ప వారసత్వం, వారి పోరాట పటిమ, వారి సహకారాన్ని గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ‘పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐఓ) హిస్టరీ అండ్ హెరిటేజ్ ఎగ్జిబిషన్’ను కూడా ప్రధాని సందర్శించారు. దీనిని ఒక ‘స్ఫూర్తిదాయక నివాళి’గా పేర్కొన్నారు.

More Stories
ఆదర్శంగా నిలబడితేనే ప్రపంచంకు భారత్ మార్గదర్శకత్వం
తాజా అమెరికా మ్యాప్ లో భారత్ లో పిఓకె, ఆక్సాయ్ చిన్
రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులపై కత్తితో దాడి