* మృతుల్లో కామారెడ్డి జిల్లా నేత ప్రభాకర్ కూడా
ఛత్తీస్‌గఢ్ -మహారాష్ట్ర సరిహద్దుల్లో శుక్రవారం భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర పోరులో ఓ జవాన్ సహా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. వారిలో గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన లోకేటి చందర్‌రావు అలియాస్ సహా కూడా మృతి చెందారు. మరో జవాను తీవ్రంగా గాయపడ్డారు.
ఫోదేవాడ సమీప అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం రాత్రి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించగా, శుక్రవారం ఉదయం మరో నలుగురి మృతదేహాలు లభ్యమైనట్టు గడ్చిరోలి పోలీసులు తెలిపారు.
ఎన్‌కౌంటర్‌లో దీపక్ చిన్నా మడావి, జోగా మడావి అనే ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్‌లో భమ్రాగడ్‌లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో దీపక్ చనిపోయారు. ఘటనా స్థలంలో మూడు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. కాగా, ఒడిశా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు నిరంజన్ రౌత్ అలియాస్ నిఖిల్, ఆయన భార్య రష్మీరా లెంక అలియాస్ ఇందుతోపాటు 19 మంది మావోయిస్టులు శుక్రవారం ఆ రాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిరంజన్‌రౌత్, రష్మీరా దంపతులపై రూ.55లక్షల చొప్పున రివార్డు ఉంది.
గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శి, పశ్చిమ సబ్‌జోనల్ బ్యూరో సభ్యుడు లోకేటి చందర్‌రావు(61) స్వస్థలం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామం. మూడున్నర దశాబ్దాల క్రితం అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దళ కమాండర్‌గా, జిల్లా కమిటీ సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత దండకారణ్యానికి వెళ్లారు.
చందర్ భార్య సులోచన కూడా భర్తతో కలిసి అడవి బాట పట్టారు. వారి కుమారుడు రమేశ్, కూతురు లావణ్య కూడా 2009లో మావోయిస్టు పార్టీలో చేరారు. సులోచన 8 ఏళ్ల క్రితం అనారోగ్యంతో దండకారణ్యంలో మరణించారు. కుమారుడు రమేశ్ ఇటీవల లొంగిపోగా, కుమార్తె లావణ్య ఛత్తీ్‌సగఢ్‌లో అరెస్టయ్యారు.

More Stories
బిజెపి గెలిస్తే మునిసిపాలిటీల్లో ఎలాంటి పన్నుల పెంపు ఉండదు
బీఆర్ఎస్-కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకుండా అప్పులే
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బిజెపి సాధించాలి